
పార్టీ వ్యవహారాలపై కనిమొళి దృష్టి
● విభాగాల వారీగా భేటీకి నిర్ణయం
సాక్షి, చైన్నె: డీఎంకే ఉపప్రధాన కార్యదర్శి కనిమొళి కరుణానిధి పార్టీ వ్యవహారాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు. పార్టీకి అనుబంధంగా ఉన్న విభాగాలతో సమావేశాలకు నిర్ణయించారు. సోమవారం పార్టీ సాహితీ విభాగం ప్రతినిధులతో సమావేశమయ్యారు. డీఎంకేలో ఎంపీగా కనిమొళి తూత్తుకుడి రాజకీయ వ్యవహారాలు, ప్రగతిపై ప్రత్యేక దృష్టి పెట్టేవారు. ఇది ఆమె నియోజకవర్గం కావడం ఇందుకు నిదర్శం. రాష్ట్ర పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా ఆమె ఉన్నప్పటికీ, ఢిల్లీ స్థాయి వ్యవహారాల మీద అధికంగా దృష్టి పెట్టే వారు. అలాగే, గతంలో తన చేతిలో ఉన్న మహిళా విభాగాన్ని బలోపేతం చేసే విధంగా నేటికి కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. ఈ పరిస్థితులలో కనిమొళికి డీఎంకేప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో ప్రత్యేక ఛాంబర్‌ను ఏర్పాటు చేస్తూ అధ్యక్షుడు స్టాలిన్ చర్యలు తీసుకున్నారు. తనకు కేటాయించిన ఛాంబర్ నుంచి ఇక పార్టీ సంబంధిత వ్యవహారాలపై ఉపప్రధాన కార్యదర్శిగా ఆమె తీవ్ర వ్యూహాలకు పదును పెట్టనున్నారు. పార్టీలో పలు అనుబంధ విభాగాలు ఉన్న విషయం తెలిసిందే. వీటన్నింటిలోని నిర్వాహకులతో ఇక సమావేశాలనిర్వహణ, బలోపేతం దిశగా అడుగులతోపాటూ కార్యక్రమాలను మరింత వేగవంతం చేయించే విధంగా కార్యాచరణలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా తొలిసారిగా సాహితీ విభాగం నేతలతో కనిమొళి సమావేశమయ్యారు. ప్రసంగించే క్రమంలో, సూచనలు ఇచ్చే క్రమంలో ఆమె లేచి నిలబడి మరీ నేతలకు మార్గదర్శనం చేయడం విశేషం.