
అసెంబ్లీ ఎన్నికల్లో సత్తాచాటాలి
తిరుత్తణి: అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రతి డీఎండీకే కార్యకర్త అలుపెరుగని కృషి చేయాలని డీఎండీకే నూతన నియోజక్వర్గ ఇన్‌చార్జ్‌ల సమావేశంలో మండల సహాయ ఎన్నికల ఇన్‌చార్జ్ మాజీ ఎమ్మెల్యే నల్లతంబి పేర్కొన్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఎన్నికల పనుల్లో నిమగ్నమయ్యాయి. ఇందులో భాగంగా డీఎండీకే తిరువళ్లూరు వెస్ట్ జిల్లాలోని నియోజకవర్గాలకు కొత్తగా ఇన్‌చార్జ్‌లు నియమించారు. వారి పరిచయ సమావేశం తిరుత్తణిలోని ప్రైవేటు కల్యాణ మండపంలో సోమవారం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కార్యదర్శి కృష్ణమూర్తి అధ్యక్షత వహించారు. ఇందులో మండల సహాయ ఎన్నికల ఇన్‌చార్జ్ మాజీ ఎమ్మెల్యే నల్లతంబి, జిల్లా ఎన్నికల ఇన్‌చార్జ్ ఏకాంబరం పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరువళ్లూరు, తిరుత్తణి, పూందమల్లి నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు శరవణన్, కుమార్, శ్రీరామ్ తదితరులను పరిచయం చేసి మాట్లాడారు. ఎన్నికల్లో అధికారం కోసం డీఎండీకే సహాయం ప్రధాన పార్టీలకు అత్యంత అవసరమని, కూటమికి సంబందించి పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని, పార్టీ క్యాడర్ సమష్టిగా ఎన్నికలకు సిద్దం కావాలని, ఇందుకోసం బూత్ లెవల్ కమిటీ ఏర్పాటు చేసుకుని గ్రామీణ స్థాయిలో క్యాడర్‌ను ప్రోత్సహించి ముందుకు వెళ్లాలని సూచించారు. పట్టణ కార్యదర్శి శ్రీనివాసన్, మండల కార్యదర్శులు సురేష్, తెన్నరసు, సహా అనేక మంది పాల్గొన్నారు.