
క్లుప్తంగా
అప్పుల బాధతో
యువకుడి ఆత్మహత్య
అన్నానగర్: విరుగంబాక్కం, సమీపం ఆళ్వార్ తిరునగర్, అంజుగం వీధికి చెందిన బాగేష్ కుమార్ (40) స్టేజ్ బిల్డర్‌గా పనిచేసేవాడు. గత కొన్ని నెలలుగా అతనికి సరైన ఉద్యోగం లేదు. ఈ కారణంగా, అతను తన పొరుగువారి నుంచి తీసుకున్న అప్పును తిరిగి చెల్లించలేకపోయాడు. దీంతో రుణదాతలు ఒత్తిడి చేసినట్లు తెలిసింది. తీవ్ర మనస్తాపానికి గురైన బాగేష్ కుమార్ ఆదివారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి వచ్చి బాగేష్ కుమార్ మతదేహాం స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ అస్పత్రికి తరలించారు. ఈమేరకు పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
తిరుత్తణి ఆడికృత్తిక
ఏర్పాట్లపై సమీక్ష
తిరుత్తణి: తిరుత్తణిలో ఆడికృత్తిక వేడుకల్లో పాల్గొనే భక్తులకు తాగునీరు, మరుగుదొడ్లు, పరిశుభ్రత, తాత్కాలిక బస్టాండ్లకు సంబంధించి ఏర్పాట్లు చేపట్టేందుకు వీలుగా మున్సిపల్ సమావేశంలో తీర్మానం ఆమోదించారు. వివరాలు.. తిరుత్తణి మున్సిపల్ చైర్‌పర్సన్ సరస్వతి భూపతి ఆధ్వర్యంలో సమావేశం సోమవారం నిర్వహించారు. కమిషనర్ బాలసుబ్రమణ్యం స్వాగతం పలికారు. ఇందులో 20 మంది సభ్యులు. మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఆదాయ ఖర్చుల వివరాల నివేదిక సమర్పించారు. అనంతరం ఆగస్టు 16 ఆడికృత్తిక సందర్భంగా తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంకు లక్షలాది మంది భక్తులు కావళ్లతో పాల్గొననున్న క్రమంలో మున్సిపల్ శాఖ ద్వారా పట్టణంలో పారిశుధ్య పనులతో పాటూ తాత్కాలిక బస్టాండ్లు, మరుగుదొడ్లు, తాగునీటి సరఫరా, భక్తులకు కనీస సదుపాయాలు కల్పించాలని తీర్మానించారు. అలాగే కాలనీ పేరిట వున్న పేర్లను తొలగించి ప్రాంతం పేర్లు మార్చాలని తీర్మానించారు. అభివృద్ధి పనులకు వీలుగా నిధులు కేటాయించి తీర్మానం ఆమోదించారు.
లాకప్ డెత్ రచ్చ
సాక్షి, చైన్నె : శివగంగైలో జరిగిన లాకప్ డెత్ ఘటన రచ్చకెక్కింది. సెక్యూరిటీ అజిత్‌కుమార్‌ను పోలీసులు కొట్టిచంపేశారంటూ ప్రతి పక్షాలు దుమ్మెత్తి పోసే పనిలో పడ్డాయి. శివగంగై జిల్లా తిరుబువనం సమీపంలోని మడప్పురం ఆలయంలో తాత్కాలిక సెక్యూరిటీగా పనిచేస్తున్న అజిత్ కుమార్(27)ను విచారణ పేరిట పోలీసులు వేధించి, చితక్కొట్టడంతో మరణించినట్టు ఆదివారం సమాచారం వెలుగు చూసింది. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ కావడంతో ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. అయితే ఈ వ్యవహారం సోమవారం రచ్చకెక్కింది. కొందరు పోలీసులు వ్యవహరించే తీరుపై డీఎంకే కూటమిలోని పార్టీలు సైతం పెదవి విప్పడం గమనార్హం. సెక్యూరిటీని విచారణ పేరిట తీసుకెళ్లి కొట్టడం ఏమిటో అని వీసీకే నేత తిరుమావలవన్ అసహనం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరగాలని, బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై డిమాండ్ చేశారు. ఇక, బీజేపీ, అన్నాడీఎంకే నేతలైతే ఈ వ్యవహారాన్ని వివాదాస్పదం చేశారు. పోలీసులపై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇక, అన్నాడీఎంకే న్యాయ విభాగం తరఫున మద్రాసు హైకోర్టులో సుమోటో కేసు నమోదుకు విజ్ఞప్తి చేశారు. అలాగే మానవ హక్కుల కమిషన్‌ను సామాజిక కార్యకర్తలు ఆశ్రయించడంతో వ్యవహారం తీవ్ర రచ్చకెక్కినట్టైంది.
శ్మశానంలో బ్రిడ్జి నిర్మాణ
పనులపై ఫిర్యాదు
వేలూరు: శ్మశానంలో మృతదేహాలను తీసి వేసి బ్రిడ్జి నిర్మాణ పనులు చేస్తున్నారని ఆరోపిస్తూ గ్రామస్తులు కలెక్టర్ సుబ్బలక్ష్మి వద్ద వినతిపత్రం అందజేశారు. సోమవారం ఉదయం కలెక్టరేట్‌లో ప్రజా విన్నపాల దినోత్సవం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రజల నుంచి వచ్చిన వినతీ పత్రాలను స్వీకరించారు. దీంతో జిల్లా నలుమూలల నుంచి ప్రజలు వివిధ సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు. ఇందులో వేలూరు జిల్లాలోని కేవీ కుప్పం తాలుకా తుత్తితాంగల్ గ్రామానికి చెందిన ప్రజలు అందజేసిన వినతిలో పేర్కొన్న విధంగా తమ గ్రామంలో బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్నాయని అయితే ఇందుకోసం తమ శ్మశానంలో ఉన్న మృతదేహాలను సైతం తవ్వేస్తున్నారని, ఫలితంగా తమకు రానున్న రోజుల్లో స్మశానం పూర్తిగా లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే మాజీ ఎమ్మెల్యే లత ఇచ్చిన ఫిర్యాదులో సాగుబడి రైతులందరిని గుర్తించి వారికి వారికి తగిన గుర్తింపు కార్డులు మంజూరు చేసి కిసాన్ పథకం కింద రైతులకు రూ.12వేలు ఇప్పించాలని కోరారు. వినతులు స్వీకరించిన కలెక్టర్ అర్హులైన లబ్ధిదారులకు వివిధ శాఖల ద్వారా సంక్షేమ పథకాలను అక్కడిక్కడే అందజేశారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ మాలతి, అధికారులు పాల్గొన్నారు.

క్లుప్తంగా