
ప్రతిభా అవార్డుల ప్రదానం
వేలూరు: తిరువణ్ణామలై జిల్లాలోని జవ్వాది కొండపై ఏటా నిర్వహించే వేసవి ఉత్సవాలు ఆదివారం సాయంత్రంతో ముగిసింది. శని, ఆదివారాల్లో జరిగిన ఈ ఉత్సవాలకు అటవీ ప్రాంతం రైతులు వివిధ పంటలను తయారు చేసి ప్రదర్శనలో ఉంచారు. అదేవిధంగా అటవీ ప్రాంత యువకులకు, మహిలలకు, వేర్వేరుగా వివిధ క్రీడా పోటీలు నిర్వహించారు. బహుమతుల ప్రదానోత్సవం ఆదివారం రాత్రి జరిగింది. ఈ కార్యక్రమానికి కలెక్టర్ తర్పగరాజ్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రి ఏవా వేలు ముఖ్య అతిథిగా హాజరై వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ జవ్వాది కొండపై అటవీ ప్రాంత ప్రజలను, విద్యార్థులను ఉత్సాహ పరిచేందుకు ఏటా వేసవి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవాలకు జవ్వాది కొండనుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు అధికంగా వచ్చార న్నారు. పర్యాటకులను ఆకట్టుకునే విధంగా పుష్పాల ప్రదర్శన, పండ్లు ప్రదర్శన, ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియజేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం వివిధ ప్రభుత్వ శాఖలకు అవార్డుల సర్టిఫికెట్లను అందజేశారు. అదే విధంగా ప్రభుత్వ శాఖల ద్వారా లబ్దిదారులకు పథకాలను అందజేశారు. ఉత్సవాలను పురస్కరించుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు అటవీ ప్రాంత ప్రజల సంప్రదాయలతో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆ సమయంలో వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన శునకాలు వివిధ విన్యాసాలను చేసి పర్యాటకులను ఆకట్టుకుంది. అదే విధంగా అటవీ ప్రాంతంలోని మహిళలకు మారథాన్, దారం లాగుట, కబడీ వంటి వివిధ పోటీలు నిర్వహించారు. ఆదివారం సెలవు రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో జవ్యాది కొండపైకి రావడంతో కొండపై పర్యాటకులతో కిటకిటలాడింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గిరి, శరవణన్, డీఆర్‌ఒ రామ్ ప్రధీపన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.