
నెల్లయ్యప్పర్ సన్నిధిలో ఆణి బ్రహ్మోత్సవం
సాక్షి, చైన్నె : తిరునల్వేలిలో ప్రసిద్ధి చెందిన నెల్లయ్యప్పర్ ఆలయంలో ఆణి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. సోమవారం ఉదయం ఘనంగా ఉత్సవాలకు ధ్వజారోహణం వేడుక జరిగింది. పెద్దఎత్తున భక్త జనం తరలి రావడంతో ఆధ్యాత్మిక వాతావరణంలో నెల్‌లై పట్టణం మునిగింది. తిరునల్వేలి(నెల్‌లై) నగర నడి బొడ్డున నెల్లయ్యప్పర్, గాంధి మది అమ్మన్ పేరిట శివ, పార్వతిలు కొలువై ఉన్నారు. ఇక్కడ ఆణి ఉత్సవాలు అత్యంత వేడుకగా జరుగుతాయి. ఈ ఉత్సవాలకు ధ్వజారోహణం ఉదయం జరిగింది. స్వామి అమ్మవార్లకు ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి అమ్మవార్లను ధ్వజస్తంభం వద్దకు తీసుకొచ్చారు. ధ్వజస్తంభం వద్ద శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు జరిగాయి. శివాచార్యులు ఉత్సవాలకు శ్రీకారం చుడుతు పతకాన్ని ఎగుర వేసి ధ్వజారోహణం ఘనంగా నిర్వహించారు. దక్షిణ తమిళనాడులోని పలు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఈ ఉత్సవాలకు తరలి రానున్నారు. దీంతో ఇక్కడి ఉత్సవాల నిమ్తితం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ పరిసరాలలో భద్రతను పెంచారు.ఈ ఉత్సవాలలో అత్యంత ముఖ్య ఘట్టం రథోత్సవం ఈనెల 8వ తేదీన జరగనుంది.
● ఘనంగా ధ్వజారోహణం

నెల్లయ్యప్పర్ సన్నిధిలో ఆణి బ్రహ్మోత్సవం