
విగ్రహాల తరలింపునకు తీర్మానం
కొరుక్కుపేట: చైన్నె రోడ్లకు అడ్డంగా ఉన్న ప్రముఖ నాయకుల విగ్రహాలను మరో చోటికి తరలించనున్నారు. సోమవారం జరిగిన కార్పొరేషన్ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. చైన్నె కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశానికి మేయర్ ప్రియా అధ్యక్షత వహించారు. డిఫ్యూటీ మేయర్ మహేష్ కుమార్, కమిషనర్ కుమార్ గురుభరన్ హాజరయ్యారు. కౌన్సిల్ సమావేశానికి కేవలం 40 మంది కౌన్సిలర్లు మాత్రమే హాజరయ్యారు. చైన్నె కార్పొరేషన్ బోర్డు విద్యార్థుల సంక్షేమాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. ఇదిలా ఉండగా రోడ్లకు అడ్డంగా ఉన్న విగ్రహాలను మరోచోటికి తరలించేలా తీర్మానం చేశారు. ఇందులో జీఎన్ శెట్టి రోడ్డులో ఉన్న కలైవానర్ ఎన్‌ఎస్ కృష్ణన్ విగ్రహాన్ని కలైవానర్ అరంగం ప్రాంతానికి తరలించడానికి కౌన్సిల్ అనుమతి మంజూరు చేసింది. అలాగే ఎగ్మోర్ మ్యూజియం కాంప్లెక్స్‌లోని కన్నిమోరా పుస్తక దుకాణం ప్రవేశ ద్వారం వద్ద కార్లమార్క్స్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతి లభించింది. తిరువాన్మాయూర్ రైల్వేస్టేషన్ సమీపంలోని పార్కులో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతి లభించింది. తమిళ అభివృద్ధి ఉద్యమ ప్రాంగణంలో దేవన్యా భావనార్ విగ్రహాన్ని ప్రతిష్టించడానికి చైన్నె జిల్లా కలెక్టర్‌కు నిరభ్యంతర పత్రం ముంజూరు చేయడం, దిగంగత ఆర్చ్ బిషప్ నివసించిన వాడల్స్ రోడ్డు పేరును ఆర్చ్ బిషప్ ఎజ్రా సర్కునం రోడ్డుగా మార్చడం వంటి 110 తీర్మానాలు ఆమోదించారు.