జ్ఞానశేఖరన్‌కు 30 ఏళ్లు జైలు
● రూ. 90 వేలు జరిమానా ● శిక్ష ఖరారు చేసిన మహిళా కోర్టు
సాక్షి, చైన్నె: అన్నావర్సిటీ క్యాంపస్‌లో విద్యార్ధినిపై జరిగిన లైంగిక దాడి కేసులో నిందితుడు జ్ఞానశేఖరన్‌కు 30 సంవత్సరాల జైలు శిక్ష, రూ.90 వేలు జరిమానా విధిస్తూ చైన్నె మహిళా కోర్టు న్యాయమూర్తి రాజలక్ష్మి సోమవారం తీర్పు వెలువరించారు. చైన్నెలోని అన్నావర్సిటీ ఆవరణలో విద్యార్థినిపై లైంగిక దాడి వ్యవహారం గత ఏడాది చివరలో పెను వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. నిందితుడు జ్ఞానశేఖర్‌ను అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. ఈ ఘటనను అస్త్రంగా చేసుకుని అన్నాడీఎంకే, బీజేపీలు డీఎంకే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే దిశగా ఆందోళనలు కొనసాగించాయి. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సైతం దృష్టి సారించింది. నిజ నిర్ధారణ కమిటీని రంగంలోకి దించింది. అదే సమయంలో ఈ ఘటనను మద్రాసు హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ కేసును సిట్‌కు అప్పగించారు. మహిళ ఐపీఎస్ అధికారులు స్నేహప్రియ, జమాల్ బృందాల నేతృత్వంలోని సిట్ బృందం విచారణను వేగవంతం చేసింది. ఐదు నెలల్లో కేసును ముగించింది. అన్ని రకాల ఆధారాలను, సాక్ష్యాలను కోర్టు ముందు ఉంచారు. మద్రాసు హైకోర్టు ఆవరణలోని మహిళా కోర్టు న్యాయమూర్తి రాజలక్ష్మి విచారణను వేగవంతం చేసి అన్ని వర్గాల నుంచి వాంగ్మూలం సేకరించారు. కేసు విచారణను గత వారం ముగించారు. గత బుధవారం తీర్పు అని ప్రకటించారు. ఈ మేరకు న్యాయమూర్తి రాజలక్ష్మి ఈ కేసులో జ్ఞానశేఖరన్‌ను దోషిగా ప్రకటించారు.
30 ఏళ్లు జైలు శిక్ష
జ్ఞానశేఖరన్‌పై మొత్తం 11 కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఒక్కో కేసులో ఒక్కో శిక్షను విధిస్తూ సోమవారం ఉదయం న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. ఈకేసులో అతడొక్కడే దోషిగా తేలిన దృష్ట్యా, అన్ని కేసులలోనూ కలిపి మొత్తంగా 30 సంవత్సరాల జైలు శిక్షను, రూ.90 వేలు జరిమానాను విధించారు. అతడికి జైలులోగానీ, ఆ తదుపరి కాలానుగుణంగా గానీ ఎలాంటి రాయితీలు(సత్‌ప్రవర్తన) ఇవ్వడానికి వీలు లేదని స్పష్టంగా తీర్పులో న్యాయమూర్తి ప్రకటించారు. పూర్తిగా 30 ఏళ్ల జైలు జీవితాన్ని అతడు అనుభవించాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ తీర్పుపై ప్రభుత్వ న్యాయవాది మేరీ జయంతి మాట్లాడుతూ ఈ కేసులో అన్ని రకాల సాక్ష్యుల విచారణ మేరకు తీర్పు వెలువడిందన్నారు. ఫోరెన్సిక్ నిపుణులు, ప్రైవేటు సెల్ ఆపరేటర్ ప్రతినిధుల వాంగ్మూలాన్ని సైతం కోర్టు కీలకంగా పరిగణించి నమోదు చేసిందన్నారు. ఈ కేసులో జ్ఞానశేఖరన్ ఒక్కడే నిందితుడు అని, మరొకరు ఈ కేసులో లేరని స్పష్టం చేశారు. అదే సమయంలో ఈ కేసులో మరొకరు ఉన్నట్టుగా ఎవరు ఆ సారు అంటూ ప్రతి పక్షాలు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో సమగ్ర విచారణతోనే తీర్పు వెలువడిందని ఆమె స్పష్టం చేశారు. మరలా పాత పాటనే ఎవరైనా అందుకుంటే కోర్టు ధిక్కారం పరిధిలోకి వస్తారని హెచ్చరించారు. ఈ తీర్పును సీఎం స్టాలిన్ ఆహ్వానించారు. పోలీసుల పనితీరును అభినందించారు. పీఎంకే నేత అన్బుమణితో పాటుగా పలువురు ఆహ్వానించారు. అదే సమయంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి ఎక్స్ వేదికగా స్పందిస్తూ తమ ప్రభుత్వం ఏర్పడగానే, ఈ కేసులో ఆ వ్యక్తిని ఎవ్వరూ రక్షించ లేరని వ్యాఖ్యలు చేశారు. మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందిస్తూ తీర్పును ఆహ్వానించారు. అయితే జ్ఞానశేఖరన్‌కు సాయం చేసిన ఆ పెద్ద మనిషి ఎవరో అన్నది తేలక పోవడం విచారకరంగా పేర్కొన్నారు.


