
ప్రభుత్వ ఉద్యోగులకు జీవిత, ప్రమాద బీమా
సాక్షి, చైన్నె: ప్రభుత్వ ఉద్యోగులకు జీవిత, ప్రమాద బీమాతో సహా బ్యాంకు ప్రయోజనాల ఉచిత సేవలను అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ప్రముఖ బ్యాంకులతో సీఎం స్టాలిన్ సమక్షంలో సోమవారం సచివాలయంలో అవగాహన ఒప్పందాలు జరిగాయి. జీవిత, ప్రమాద బీమాతో సహా బ్యాంకింగ్ ప్రయోజనాలు ఉచితంగా అందించడానికి 7 మార్గదర్శక బ్యాంకులతో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు , వారి కుటుంబాల సంక్షేమం విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నట్టు సీఎం పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం లక్ష్యంగా అసెంబ్లీలో చేసిన ప్రకటనలు, వివిధ రాయితీలను గుర్తు చేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో వ్యక్తిగత జీవిత బీమా , ప్రమాద బీమాలో పురోగతి సాధిస్తున్నాయని వివరించారు. నేటి యుగంలోప్రతి వ్యక్తికి జీవిత బీమా తప్పని సరిగా పేర్కొంటూ, అత్యవసర పరిస్థితులలో ఈ భీమా ఎంతో ఉపయోగకరంగా ఉందని వివిరంచారు. ఉద్యోగుల జీవిత బీమా, వ్యక్తిగత ప్రమాద బీమా మొదలైన వాటి కోసం. ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండా బీమా పొందేందుకు ప్రభుత్వం బ్యాంకులతో చర్చించి నిర్ణయం తీసుకుందన్నారు.
కీలక ఒప్పందాలు
ఫలితంగా, అనేక బ్యాంకులు రాయితీలు అందించడానికి ముందుకొచ్చాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు , అధికారులు హఠాత్తుగా జరిగే ప్రమాదంలో మరణించినప్పుడు లేదా ప్రమాదం కారణంగా శాశ్వత వైకల్యం సంభవిస్తే వారికి ప్రభుత్వం రూ. ఒక కోటి బీమా సౌకర్యాన్ని అందిస్తుందన్నారు. అలాగే, ఉద్యోగి లేదా అధికారి కుటుంబంలో వివాహ వయస్సు వచ్చిన కుమార్తె వివాహం ఖర్చుల కోసం కుమార్తె ఒక్కొక్కరికి రూ. 5 నుంచి పది లక్షల వరకు ఆర్థిక సాయం, ఉన్నత విద్యను అభ్యసిస్తున్న కుమార్తెకు రూ. 10 లక్షల స్కాలర్‌షిప్ అందించే విధంగా చర్యలు చేపట్టినట్టు తెలిపారు. సహజ మరణం సంభవిస్తే, జీవిత బీమా మొత్తం రూ. 10 లక్షలు అందజేయనున్నారని పేర్కొన్నారు. పైన పేర్కొన్న ప్రయోజనాలను అందించడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఓవర్సీస్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా 7 మార్గదర్శక బ్యాంకులలో.. ఉద్యోగులు తమ జీతాల ఖాతాలను నిర్వహిస్తున్నట్లయితే, పై ప్రయోజనాలతో పాటు వ్యక్తిగత బ్యాంకు రుణాలు, గృహ రుణాలు విద్యా రుణాలను అందించేందుకు వీలు కలిగినట్టు అవుతుందన్నారు.ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ప్రయోజనాలను అందించడానికి బ్యాంకులు కట్టుబడి ఉన్నాయన్నారు. అందుకే ఈ ఒప్పందాలకు సంబంధించి సీఎంస్టాలిన్ సమక్షంలో ట్రెజరీ, అగ్రాగామి బ్యాంకుల డైరెక్టర్ అఫ్ అకౌంట్స్, సీనిర్ అధికారులతో ప్రభుత్వ అధికారుల ఒప్పందాలు జరిగినట్టు ప్రకటించారు. ఈకార్యక్రమంలో ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎన్ మురుగానందం, ఆర్థిక శాఖ కార్యదర్శి టి. ఉదయచంద్రన్, ట్రేజరీ, అకౌంట్‌తో పాటుగా వివిధ విభాగాల అధికారులు నాగరాజన్, చారుశ్రీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో రూ. 457.14 కోట్లతో నిర్మించిన పోలీసుస్టేషన్లు, పోలీసు క్వార్టర్సులు, రూ. 211 కోట్ల 57 లక్షలతో కోయంబత్తూరు సెంట్రల్ జైలు భవనంను వీడియో కాన్పరెన్స్ ద్వారా సీఎం స్టాలిన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోం శాఖ కార్యదర్శి ధీరజ్ కుమార్, డీజీపీ శంకర్ జివాల్, తమిళనాడు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ శైలేష్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు.