
కాట్పాడిలో యువకుడి దారుణ హత్య
వేలూరు: వేలూరు జిల్లా కాట్పాడి సమీపంలోని వడుంగుట్ట గ్రామంలో దోమల వల తయారు చేసే కంపెనీలో ఒడిశా రాష్ట్రానికి చెందిన కార్మికులు పనిచేస్తున్నారు. ఇందులో ఒడిశా రాష్ట్రం సుదర్‌సాన్‌పూర్‌కు చెందిన బాల భద్ర అలియాస్ బలియా(33) అక్కడున్న అద్దె ఇంటిలో ఉంటూ పని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో వడుంగట్టలోని ప్రైవేటు కల్యాణ మండపం వెనుక ఉన్న రైల్వే పట్టాల సమీపంలో ఒక యువకుడి తలపై రాళ్లతో కొట్టి మొహం గుర్తు పట్టలేని విధంగా అతి దారుణంగా ఉండడాన్ని స్థానికులు గమనించి కాట్పాడి పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో డీఎస్పీ పయణి ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఆ సమయంలో మృతి చెందిన యువకుడి తలపై పెద్ద రాతితో కొట్టి హత్య చేసినట్లు గుర్తించారు. అనంతరం మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, విచారణ చేపట్టారు. ఇతను రాత్రి సమయంలో బయటకు ఎందుకు వెళ్లాడు, ఎవరైనా ఇతన్ని తీసుకు వెళ్లారా, హత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు.