
పిచ్చైక్కారన్ కాంబో రిపీట్
తమిళసినిమా: కథానాయకుడిగా మారి సక్సెస్ అయిన సంగీతదర్శకుడు విజయ్ఆంటోని. నాన్ చిత్రంతో హీరోగా అవతారమెత్తిన ఈయన ఆ తరువాత సలీమ్, ఇండియా పాకిస్తాన్. పిచ్చైక్కారన్ వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. తాజాగా ఈయన హీరోగా నటించిన మార్గన్ చిత్రం జూన్ 27న విడుదలకు సిద్ధం అవుతోంది. అదేవిధంగా విజయ్ఆంటోని కథానాయకుడిగా శక్తి తిరుముగన్, లాయర్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ఆంటోని కొత్త చిత్రం గురించి అధికారిక ప్రకటనను వెల్లడించారు. 2016లో విజయ్ ఆంటోని దర్శకుడు శశి కాంబినేషన్లో పిచ్చైక్కారన్ చిత్రం రూపొంది ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా ఆ కాంబినేషన్లో తాజాగా మరో చిత్రం రూపొందనుంది. ఇంతకుముందు శశి దర్శకత్వంలో శివప్పు మంజల్ పచ్చై చిత్రాన్ని నిర్మించిన అభిషేక్ ఫిలింస్ సంస్థ రమేశ్ పి.పిళై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇద్దరు కథానాయకుల కథాంఽశంతో కూడిన ఇందులో విజయ్ఆంటోని, ఆయన సోదరి కుమారుడు అజయ్ దిశాన్ హీరోలుగా నటించనున్నారు. కాగా లబ్బర్బంతు, మామన్ చిత్రాల ఫేమ్ స్వాశిక ఈ చిత్రంలో ముఖ్యపాత్రను పోషించనున్నారు. ఉత్తర చైన్నెలో జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుందని విజయ్ఆంటోని చెప్పారు. ఇంకాపేరు పెట్టని ఈ చిత్రానికి బాలాజీ శ్రీరామ్ సంగీతాన్ని, దర్శన్ కిర్లోశ్ చాయాగ్రహణం అందిస్తున్నారు. కాగా పిచ్చైక్కారన్ చిత్రం కాంబోలో తెరకెక్కనుండడంతో దీనిపై చాలా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.