
డీఎంకే కూటమిలో పెరిగిన టెన్షన్
సాక్షి, చైన్నె: డీఎంకే కూటమిలో టెన్షన్ అన్నది తీవ్రస్థాయికి చేరిందని బీజేపీ మహిళా నేత, మాజీ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ విమర్శించారు. ఆదివారం కమలాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, డీఎంకే కూటమిపై విమర్శలు గుప్పించారు. వారిది ప్రెసర్( ఒత్తిడి)కి లోనైన కూటమి అని, తమది ప్లషర్ (హ్యాపీనెస్ ) కూటమి అని వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకే– బీజేపీ కూటమి ఏర్పాటుతో డీఎంకేలో వణుకు బయలుదేరిందని, అది ఇప్పుడు తారాస్థాయికి చేరి ఉందన్నారు. అందుకే తమ కూటమికి వ్యతిరేకంగా స్వయంగా సీఎం స్టాలిన్ స్పందిస్తూ విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం తమిళనాడుకు అన్ని రకాలుగా సహకారం అందిస్తుంటే, ఇక్కడి పాలకులు తప్పుడు సమాచారాలను ప్రజలలోకి పంపిస్తున్నారన్నారు. విజయ్ సైతం డీఎంకే కూటమికి వ్యతిరేకంగా వెళ్తున్నారని, ఆయన సరైన నిర్ణయంతో ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు.
సరైన సమయంలో
స్పందిస్తాం!
– ఎల్‌కే సుదీష్
సాక్షి, చైన్నె: డీఎండీకేకు రాజ్యసభ సీటు ఇస్తామని అన్నాడీఎంకే చేసిన వాగ్దానం విషయంలో సరైన సమయంలో స్పందిస్తామని, అన్ని వివరాలు బయట పెడుతామని ఆ పార్టీ కోశాధికారి ఎల్‌కే సుదీష్ పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో అన్నాడీఎంకేతో కలిసి ఐదుచోట్ల డీఎండీకే పోటీచేసిన విషయం తెలిసిందే. డీఎండీకే అధినేత విజయకాంత్ మరణం తర్వాత ఎదుర్కొన్న ఎన్నికలలో రెండు చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు డీఎంకే కూటమికి గట్టి పోటీనే ఇచ్చారు. ఎన్నికల కూటమి ఒప్పందం మేరకు డీఎండీకే కు ఓ రాజ్య సభ సీటు ఇచ్చే విధంగా ఒప్పందాలు జరిగినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అయితే ఎన్నికల అనంతరం అన్నాడీఎంకే ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. మరో నెల రోజులలో తమిళనాడు నుంచి ఆరు స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ పదవుల భర్తీకి సంబంధించిన కసరత్తులు మొదలైనా, అన్నాడీఎంకే నుంచి స్పందన లేదు. అదే సమయంలో బీజేపీతో అన్నాడీఎంకే జత కట్టడంతో తాము ఏ కూటమిలోనూ లేదని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్ ప్రకటించారు. ఈ పరిస్థితులలో ఆదివారం డీఎండీకే కోశాధికారిగా బాధ్యతలు చేపట్టిన ఎల్‌కే సుదీష్ మీడియాతో మాట్లాడుతూ, రాజ్యసభ సీటు విషయంగా ప్రస్తావించారు. తమకు రాజ్యసభ సీటును ఇస్తామని అన్నాడీఎంకే స్పష్టం చేసిన మాట వాస్తవమేనని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు, వివరాలను సరైన సమయంలో బయట పెడుతామన్నారు. తమ పార్టీ బలోపేతం దిశగా కసరత్తులు వేగవంతం చేశామని, ప్రజలలోకి చొచ్చుకెళ్లే కార్యక్రమాలు మున్ముందు మరింతగా ఉంటాయన్నారు.
చేపలు పడుతుండగా
విద్యుదాఘాతం
– ఇద్దరు మృతి
సేలం : నదిలో చేపలు పట్టడానికి వెళ్లిన ఇద్దరు యువకులు విద్యుదాఘాతంతో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని కలిగించింది. పెరంబలూరు జిల్లాలోని వేప్పందట్టై సమీపంలోని తొండమందురై గ్రామం గుండా కల్లార్ అనే నది ప్రవహిస్తోంది. వేసవి కాలం కావడంతో నీటి సరఫరా లేకపోవడంతో కొన్ని చోట్ల అక్కడక్కడ కొన్ని నీళ్లు మాత్రమే నిలిచి ఉన్నాయి. ఈ నీటిలో చాలా చేపలు ఉన్నాయి. ఈ చేపలను పట్టుకోవడానికి, ఈ ప్రాంతానికి చెందిన కొంతమంది రాత్రిపూట నదిలోకి నీటిని పంప్ చేయడానికి విద్యుత్‌ను ఉపయోగించడం అలవాటుగా చేసుకున్నారు. నీటిలో విద్యుత్ ప్రవహించినప్పుడు, నీటిలోని చేపలు షాక్‌కు గురై స్పృహ కోల్పోయి, నీటిపైన తేలుతాయి. వారు ఆ చేపలను పట్టుకుని అమ్ముతున్నారు. ఇది ప్రమాదకరమైన పద్ధతి అయినప్పటికీ, కొంతమంది చాలా కాలంగా ఈ విధంగా చేపలు పడుతున్నారు. ఈ పరిస్థితిలో, తొండమందురైకి చెందిన దినేష్ కుమార్ (28), రంజిత్ (25) ఆదివారం తెల్లవారుజామున కల్లార్ నదిలో కరెంటు ఆన్ చేసి చేపలు పట్టడానికి వెళ్లారు. అప్పుడు, ఇద్దరూ జారిపడి నీటిలో పడిపోయారు. దీంతో ఇద్దరూ విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మునిగిపోయారు. స్థానికులు గుర్తించి అరుంబావూరు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపరీక్ష కోసం పెరంబలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

డీఎంకే కూటమిలో పెరిగిన టెన్షన్