
బైకు గుంతలో పడి దంపతుల దుర్మరణం
●కుమార్తెకు తీవ్రగాయాలు
సేలం : తిరుపూర్ జిల్లా తారాపురం సమీపంలో రోడ్డుపై వంతెన నిర్మాణం కోసం తవ్వి ఉన్న గుంతలో అదుపుతప్పి పడి దంపతులు దుర్మరణం చెందారు. వివరాలు.. తిరుప్పూర్ జిల్లా తారాపురం సమీపంలో సేర్వకారణ్‌పాళయంకు చెందిన వ్యక్తి నాగరాజ్. ఇతని భార్య ఆనంది. వీరికి 8వ తరగతి చదువుతున్న కుమార్తె దిషానా (13) ఉంది. నాగరాజ్ ఆదివారం వేకువజామున తన భార్య, కుమార్తెతో బైక్‌పై తిరునల్లారు ఆలయానికి వెళ్లి, తిరిగి తారాపురం నుంచి బైక్‌పై ఇంటికి తిరిగి వస్తున్నారు. ఆ సమయంలో రోడ్డు మధ్యలో వంతెన నిర్మాణం కోసం పెద్ద గుంత తవ్వి ఉన్నారు. నాగరాజ్ బైక్ అదుపు తప్పి ఆ గుంతలో పడింది. ఘటనా స్థలంలోనే నాగరాజ్, ఆనంది దుర్మరణం చెందారు. తీవ్రంగా గాయపడిన కుమార్తె ప్రాణాలకు పోరాడుతూ కనిపించింది. స్థానికులు ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. స్థానిక పోలీసులు దంపతుల మృతదేహాలను శవపంచనామా నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టే ప్రైవేటు కంపెనీ వారు సరైన భద్రతా విధులు పాటించకపోవడమే ప్రధాన కారణమని ప్రజలు ఆరోపించారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన నాగరాజ్, ఆనందికు తలా రూ. 3 లక్షలు, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దినాషాకు రూ. లక్ష ఎక్స్‌గ్రేషియాను సీఎం స్టాలిన్ ప్రకటించారు.