అమాంతం పెరిగిన బీర్‌ల విక్రయం
కొరుక్కుపేట: తమిళనాడులో ఏటా వేసవిలో బీర్ రకాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. సాధారణ రోజుల్లో పోల్చితే మార్చి చివరి నాటికి బీర్ విక్రయాలు 40 శాతం పెరిగాయి. ఇతర దినాల్లో రాష్ట్రంలో రోజూ రూ.85 కోట్ల వరకు మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం బీరు విక్రయాలు సాధారణం కంటే రెట్టింపు పెరిగడంతో మద్యం విక్రయాలు రూ.లక్ష కోట్ల వరకు పెరగినట్లు అధికారులు చెబుతున్నారు.
తీరంలో ఇంధన తవ్వకాలు
● ఓఎన్‌జీసీకి అనుమతి
● తీరప్రాంత వాసుల్లో ఆగ్రహం
సాక్షి, చైన్నె: తమిళనాడు సముద్ర తీరంలో ఇంధనం, గ్యాస్ నిక్షేపాల తవ్వకానికి కేంద్రం అనుమతులు మంజూరు చేసింది. కన్యాకుమారిలో మూడు చోట్ల, చైన్నెకు సమీపంలో ఓ చోట ఈ తవ్వకాల పనులను ఓఎన్‌జీసికి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో తమిళనాడు తీర వాసులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులోని డెల్టా జిల్లాలను సురక్షిత వ్యవసాయ క్షేత్రంగా గత అన్నాడీఎంకే ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఇక్కడ బోరు బావులద్వారా ఎలాంటి గ్యాస్, ఇంధనం, హైడ్రో కార్బన్, మిథైన్ వంటి వాటి తవ్వకాలకు బ్రేక్ పడింది. దీంతో కేంద్రం ఇటీవల కాలంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వస్తోంది. సముద్ర తీరప్రాంతాలపై దృష్టి పెట్టింది. ఇది వరకే సముద్ర తీరంలో జరిగిన పరిశీలనకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా జాలర్ల గ్రామాల ప్రజలు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో సముద్ర తీరంలోని ఇంధనం, గ్యాస్ నిక్షేపాలను తవ్వుకునేందుకు కేంద్రం అనుమతులు జారీ చేసిన సమాచారం తీర వాసులలో ఆదివారం ఆగ్రహ జ్వాలను రగిల్చింది. కన్యాకుమారికి సమీపంలో బంగాళాఖాతం సముద్రంలో 3 చోట్ల, చైన్నెకు కూత వేటు దూరంలో ఓచోట ఈ తవ్వకాల పనులను ఓఎన్‌జీసీకి అప్పగించిన సమాచారంతో రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా తీరప్రాంత వాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సముద్ర సంపద నాశనం అవుతుందని, చేపల వేట గగనంగా మారుతుందని జాలర్ల సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఈ అనుమతులను తక్షణం నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అనుమతులకు వ్యతిరేకంగా సోమవారం అసెంబ్లీలో సీఎం స్టాలిన్ కీలక ప్రకటన చేయాలన్న నినాదాన్ని జాలర్ల సంఘాలు అందుకున్నాయి.
కోయంబత్తూరులో
బ్రహ్మాండ హాకీ స్టేడియం
– పనులకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన
సాక్షి, చైన్నె: కోయంబత్తూరులో అంతర్జాతీయ ప్రమాణాలతో బ్రహ్మాండ హాకీ స్టేడియం నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ పనులకు ఆదివారం సాయంత్రం డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ శంకుస్థాపన చేశారు. రూ. 9.67 కోట్లతో కృత్రిమ టర్ఫ్ హాకీ మైదానంగా ఇది రూపుదిద్దుకోనుంది. అలాగే, రూ. 82.14 కోట్లతో చేపట్టనున్న 132 కొత్త ప్రాజెక్టులకు ఉదయనిధి శంకుస్థాపన చేశారు. రూ. 29.99 కోట్లతో పూర్తిచేసిన 54 ప్రాజెక్టులను ప్రారంభించారు. 25,024 మంది లబ్దిదారులకు రూ. 239.41 కోట్ల విలువగల ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేశారు. కోయంబత్తూరు ఆర్‌ఎస్ పురం వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో అన్ని పనులకు ఉదయనిధి శ్రీకారం చుట్టారు. ముందుగా కోయంబత్తూరులో ఉదయ నిధి రోడ్ షో సాగింది. జనం ఆయనకు బ్రహ్మరథం పట్టే విధంగా ఆహ్వానం పలికారు.
మంత్రి వర్గంలో కీలక మార్పులు
– సెంథిల్, పొన్ముడి అవుట్
సాక్షి, చైన్నె: రాష్ట్ర మంత్రి వర్గంలో ఆదివారం రాత్రి కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. మనీ లాండరింగ్ కేసులో బెయిలా.. మంత్రి పదవినా? అని సెంథిల్ బాలాజీని సుప్రీంకోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో ఆయన మంత్రి పదవి ఊడినట్లయ్యింది. ఆయన చేతిలో ఉన్న విద్యుత్ శాఖను రవాణాశాఖ మంత్రి శివశంకర్‌కు అదనంగా అప్పగించారు. మరోశాఖ ఎకై ్సజ్ పదవిని గృహ నిర్మాణ శాఖ మంత్రి ముత్తు స్వామికి అందజేశారు. ఇక మహిళలు, శైవం, వైష్ణవం గురించి వివాదాస్పదన వ్యాఖ్యలు చేసిన సీనియర్ మంత్రి పొన్ముడిని పదవి నుంచి తప్పించారు. ఆయన చేతిలో ఉన్న అటవీ శాఖను పాడి పరిశ్రమల శాఖ మంత్రి రాజకన్నప్పన్‌కు అప్పగించారు. ఇక ఇటీవల మంత్రి పదవిని కోల్పోయిన మనో తంగరాజ్‌కు మరో మారు అవకాశం కల్పించారు. ఆయనకు ఎలాంటి శాఖను అప్పగించ లేదు. సోమవారం సాయంత్రం 6 గంటలకు మనో తంగరాజ్ ప్రమాణ స్వీకరం రాజ్ భవన్‌లో జరగనుంది.
అమాంతం పెరిగిన బీర్‌ల విక్రయం


