
కార్యక్రమంలో మంత్రి రాణిపేట ఆర్.గాంధీ, కలెక్టర్, ఎమ్మెల్యేలు
● 3,192 మందికి ఉద్యోగావకాశాలు
తిరువళ్లూరు: జిల్లాలో 20 నూతన పరిశ్రమల స్థాపన కోసం రూ.822.83 కోట్ల వ్యయంతో చేసుకున్న ఒప్పందంతో 3,192 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని రాష్ట్ర చేనేత శాఖ మంత్రి రాణిపేట ఆర్.గాంధీ అన్నారు. తిరువళ్లూరు కలెక్టరేట్‌లో వ్యాపారవేత్తల సమ్మిట్‌ను నిర్వహించారు. సమ్మిట్‌లో 20 మంది పారిశ్రామికవేత్తలు రూ.822.82 కోట్లతో పెట్టబడి పెట్టడానికి ముందుకు వచ్చి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో 3,192 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.ఈ నేపథ్యంలో నూతన ఒప్పందాలు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి రాణిపేట గాంధీ నేతృత్వంలో జరిగింది. మంత్రి గాంధీ మాట్లాడుతూ పారిశ్రామికవేత్తల మహానాడును చైన్నెలో జనవరి 7, 8 రెండు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ మహానాడులో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించడమే లక్ష్యమన్నారు. పెట్టుబడులకు తమిళనాడు మాత్రమే సరైన ప్రాంతమని గుర్తించే పలువురు ముందుకొస్తున్నట్టు వివరించారు. పరిశ్రమలు పెట్టడానికి అవసరమైన సబ్సిడీలతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తామన్న మంత్రి, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాలను సద్వినియోగం చేసుకుని పెట్టుబడులకు మందుకు రావాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ ప్రభుశంకర్, ఎమ్మెల్యేలు వీజీ రాజేంద్రన్, మాధవరం సుదర్శనం, తిరుత్తణి చంద్రన్, కారపాక్కం గణపతి, అసిస్టెంట్ కలెక్టర్ సుఖపుత్ర, జిల్లా పారిశ్రామిక కేంద్రం జీఎం శేఖర్ పాల్గొన్నారు.