
మాట్లాడుతున్న సత్యప్రద సాహూ
● ఎస్‌ఈసీ సాహూ వెల్లడి
సాక్షి, చైన్నె : రాష్ట్రంలో లోక్‌సభకు ఒకే విడతలో ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సత్య ప్రద సాహూ తెలిపారు. పెరంబలూరు, కరూర్ జిల్లాలో ఓటరు జాబితాలో గందరగోళంపై ఆదివారం సచివాలయం నుంచి ఆ జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో సత్యప్రద సాహూ సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తమిళనాడులో అన్ని జిల్లా కేంద్రాలలో ఆయా పరిధిలోని లోక్ సభ నియోజకవర్గాలకు అవసరమైన ఈవీఎంలు, వీవీ పాడ్‌లు, ఇతరపరికరాలను సిద్ధం చేస్తున్నామన్నారు. ఓటరు జాబితాలోమార్పులు చేర్పులకు అవకాశం కల్పించి ఉన్నామని, అలాగే కొత్త ఓటర్ల చేరిక అవగాహన కార్యక్రమాలు విస్తృతం చేయనున్నామన్నారు. కొత్త ఓటర్ల చేరి కోసం కళాశాలలో శిబిరాల నిర్వహనపై దృష్టి పెట్టామని తెలిపారు. జాబితాలో పేర్లను చేర్చేందుకు ఫాం 6ఐ, పేరు, చిరునామా, ఇతర మార్పులకు ఫాం 8 ఉపయోగించాలని ప్రజలకు సూచిస్తున్నామని వివరించారు. ఒకే ఓటరు పేరు ఇతర నియోజక వర్గాలలో ఉన్నట్లు గుర్తిస్తే, సంబంధిత ఓటరుకు సమాచారం పంపించిమరీ పేరును తొలగించడం జరుగుతుందన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై దృష్టి పెట్టామని, ఇప్పటి నుంచి పోలీసులు అక్కడి పరిస్థితులపై సమీక్షించి జిల్లాల ఎస్పీల ద్వారా తమకు నివేదికను పంపించే విధంగా ఆదేశాలు ఇచ్చామన్నారు. హిజ్రాలు అనేక మంది తమ పేర్లను ఓటరు జాబితాలో చేర్చలేదంటూ దరఖాస్తు చేశారని, వారందరి పేర్లను జాబితాలోకి తప్పకుండా చేర్చే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.