
నమితతో భర్త వీరేంద్ర చౌదరి
తమిళసినిమా: డబ్బు మోసం కేసులో నటి నమిత భర్త వీరేంద్రచౌదరికి పోలీసులు విచారణకు రావలసిందిగా సమన్లు జారీ చేశారు. కాగా తాను ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నానని, ఆరోగ్యం చేకూరిన తరువాత విచారణకు హాజరవుతానని వీరేంద్ర చౌదరి పోలీసులకు లేఖ రాశారు. దీనికి సంబంధించిన వివరాలు చూస్తే మదురై జిల్లా, ఉసిలంపట్టికి చెందిన ముత్తురామన్, ముబారక్ అనే వ్యక్తులు చిరు, మధ్య తరహా వ్యాపార సంఘం జాతీయ అధ్యక్షులం అని తమను పరిచయం చేసుకుంటున్నారు. ఈ సంఘానికి తమిళనాడు విభాగం అధ్యక్షుడిగా నటి నమిత భర్త వీరేంద్ర చౌదరిని నియమించారు. కాగా ముత్తురామన్ గోపాలసామి అనే వ్యక్తికి రూ.3 కోట్లు ఇస్తే తమిళనాడులో ఉన్నత పదవిని ఇప్పిస్తానని చెప్పాడు. అతని మాటలు నమ్మిన గోపాలసామి రెండు దఫాలుగా రూ.50 లక్షల చొప్పున పంజాబ్ రాష్ట్రానికి చెందిన ముత్తుతరామన్ స్నేహితుడు దుశ్యంత్‌కు డబ్బు ను ఇచ్చారు. అయితే ముత్తురామన్ అతనికి ఎలాంటి ప్రభుత్వ పదవిని ఇప్పించలేదు. దీంతో గోపాలసామి సూరమంగళం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా గత వారం సేలంలో ఎంఎస్‌ఎంఈ ప్రమోషన్ కౌన్సి ల్ పేరుతో ముత్తురామన్, దుష్యంత్ యాదవ్, వీరేంద్ర చౌదరి సమావేశం అయ్యారు. విషయం తెలిసిన సూరమంగలం పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లి ముత్తురామన్, దుశ్యంత్ యాదవ్‌లను పట్టుకుని విచారించారు. వారు వాడుతున్న ప్రభుత్వ ముద్రను, జాతీ య పతాకం వాడడం తెలియడంతో వారిద్దరిని అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో విచారణకు హాజరు కావలసిందిగా వీరేందర చౌదరికి సమన్లు పంపారు. అయితే సేలం పోలీసుల ఎదుట హాజరుకాని వీరేందరచౌదరి తాను అనారోగ్యం కారణంగా హాజరు కాలేకపోతున్నట్టు, ఆరోగ్యం చేకూరగానే హాజరవుతానని పోలీసులకు లేఖ రాశారు. ఆయన హాజరు కాకుంటే పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.