సాక్షి, చైన్నె: పంటల బీమాకు గడువును పొడిగిస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ బుధవారం ప్రకటించారు. రాష్ట్రంలో సంబా సీజన్‌లో పంటలకు బీమా అవకాశం కల్పిస్తూ కేంద్రం చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ గడువు నవంబర్ 15గా తొలుత నిర్ణయించారు. అయితే, రెండు మూడు రోజులుగా డెల్టా జిల్లాల్లో కరుస్తున్న వర్షాలతో బీమాపై రైతులు దృష్టి పెట్ట లేని పరిస్థితి. బుధవారం నాటికి రాష్ట్రంలో 10 లక్షల మంది రైతులు పంటలను బీమా చేశారు. మరికొన్ని లక్షల మంది బీమా చేయాల్సి ఉండడంతో ఈ గడువును పొడిగించాలని కేంద్ర వ్యవసాయ శాఖను ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. దీంతో ఈనెల 22వ తేదీ వరకు గడువును పొడిగిస్తూ కేంద్రం వెసులుబాటు కల్పించింది. త్వరితగతిన రైతులు పంటలకు బీమా చేయించుకోవాలని రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనరేట్ కోరింది.