
కమలేష్, యోగేష్ కుమార్ (ఫైల్)
సాక్షి, చైన్నె: పంజాబ్‌లోని భటిండా సైనిక శిబిరంలో గుర్తు తెలియని అగంతకులు జరిపిన కాల్పులలో మరణించిన జవాన్లలో ఇద్దరు తమిళనాడు వీరులు కూడా ఉన్నారు. ఈ సమాచారంతో వారి కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగాయి. శుక్రవారం ఆ వీరుల మృత దేహాలు స్వగ్రామాలకు చేరనున్నాయి. వివరాలు.. పంజాబ్‌లోని భటిండా సైనిక శిబిరంలో బుధవారం కాల్పులు కలకలం రేపిన విషయం తెలిసిందే.
ఇందులో నలుగురు జవాన్లు మరణించారు. వీరిలో తమిళనాడుకు చెందిన కమలేష్, యోగేశ్‌కుమార్ ఉన్నారు. సేలం జిల్లా మేట్టూరు సమీపంలోని పనకాడుకు చెందిన రైతు రవి, సెల్వవేణి దంపతుల రెండో కుమారుడు కమలేష్(25). బీఏ పట్టభద్రుడైన కమలేష్ 2019లో భారత ఆర్మీలో జవాన్‌గా చేరాడు. నెలన్నర రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చి వెళ్లాడు. ఈ పరిస్థితులో కాల్పులలో కమలేష్ మరణ సమాచారం ఆ కుటుంబాన్ని తీవ్ర శోక సంద్రంలో ముంచింది.
కమలేష్‌కు ఇంకా వివాహం కాలేదు. తమ గ్రామ బిడ్డ ఆర్మీలో అమరుడైన సమాచారంతో పనకాడు గ్రామం తీవ్ర శోకంలో మునిగింది. ఎక్కడ చూసినా కమలేష్‌చిత్ర పటాలతో కన్నీటి నివాళులర్పిస్తూ ఏర్పాటు చేశారు. గ్రామం అంతా కమలేష్ ఇంటి వద్దకు చేరి ఆ కుటుంబాన్ని ఓదార్చే పనిలో పడ్డాయి. అలాగే అమరుడైన మరో వీరుడు తేని జిల్లా దేవారానికి చెందిన జయరాజ్, రత్నం దంపతుల కుమారుడు యోగేష్ కుమార్(26).
మూడు సంవత్సరాల క్రితం అతడు ఆర్మీలో చేరాడు. రైతు కూలీగా ఉన్న జయరాజ్‌కు చేదోడు వాదోడుగా ఉంటూ, ఇద్దరు సోదరిమణులకు వివాహం చేశాడు. ఆ ఇంటికి అన్ని తానైన యోగేష్ కుమార్ కాల్పుల్లో మరణించిన సమాచారం ఆ కుటుంబాన్ని జీర్ణించుకోలేకుండా చేసింది. ఈ ఇద్దరి భౌతిక కాగాయాలు శుక్రవారం ఢిల్లీ నుంచి స్వగ్రామాలకు రానున్నాయి. అదే రోజు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.