పరిశీలించి చర్యలు తీసుకుంటాం
కోదాడ : తల్లి దండ్రుల నుంచి ఫీజులు దండుకునేందుకు జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలు సరి కొత్త విద్యా వ్యాపారానికి తెర తేశాయి. 9వ తరగతి చదువుతున్న విద్యార్థుల వార్షిక పరీక్షలు పూర్తి కాక ముందే శ్రీజూనియర్ టెన్త్‌శ్రీ పేరుతో పదో తరగతి పాఠ్యాంశాలు బోధిస్తున్నారు. స్టడీ మెటీరియల్, ఫీజుల పేరుతో వారి వద్ద నుంచి వేల రూపాయలు ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు. విద్యాశాఖ అధికారులు పట్టించుకోక పోవడంతో వారి ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది.
నిబంధనలకు వ్యతిరేకంగా
9వ తరగతి చదివే విద్యార్థులు వార్షిక పరీక్షలు రాశాక, వారి ప్రగతిని పరీశీలించాకే పదో తరగతిలో ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. కానీ అకడమిక్ ఇయర్ పూర్తి కాక ముందు వారికి జూనియర్ టెన్త్ అంటూ పేరు పెట్టి ఏకంగా తరగతులే బోధిస్తున్నారు. దీని కోసం ప్రైవేట్ పబ్లికేషన్‌ల మెటీరియల్‌ను విద్యార్థులకు అంట గడుతూ తల్లిదండ్రలు నుంచి రూ. 15 వేల నుంచి 20 వేల వరకు తీసుకుంటున్నారు. మరి కొన్ని పాఠశాలలు పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక యూనిఫాం అంటూ అందుకు రూ. 2 నుంచి 3 వేలు వసూలు చేస్తున్నారు.
తల్లిదండ్రుల ఆతృతే పెట్టుబడి
సంక్రాంతి సెలవుల అనంతరం జిల్లాలోని కోదాడ, సూర్యాపేట, హుజూర్‌నగర్‌లో ఉన్న పలు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం తమ వద్ద 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఆ పాఠాలు బోధించడం ఆపేశారు. జూనియర్ టెన్త్ పేరుతో వారికి 10వ తరగతి పాఠాలు చెప్పడం మొదలు పెట్టారు. 9వ తరగతి అంత ముఖ్యం కాదని పదో తరగతి పబ్లిక్ పరీక్షలలో మీ పిల్లలు మంచి మార్కులు సాధించాడానికే ముందుగా పాఠాలు బోధిస్తున్నామని చెబుతూ తల్లిదండ్రులు, పిల్లలలో ఆతృత కలిగిస్తున్నారు. తమ పిల్లలు ఎక్కడ వెనుకబడి పోతారో అనే ఆందోళనతో తల్లిదండ్రులు నిర్వాహకులు చెప్పిన విధంగా తలూపుతున్నారు. భారమైనప్పటికీ వేల రూపాయలను ముందస్తుగా చెల్లిస్తున్నారు. బయటి మార్కెట్‌లో రూ.100కు దొరికే పుస్తకం అట్టలపై తమ సంస్థ పేరు ముద్రించి రూ.4 వందలకు అంటగడుతున్నారని పలువురు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలో చదివిస్తున్న విద్యా వంతులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు కూడా 9వ తరగతి పూర్తి కాక ముందే 10వ తరగతి పాఠాలు ఎలా మొదలు పెడతారని అడిగిన పాపాన పోలేదు.
ఆర్థిక భారం
సూర్యాపేట జిల్లాలో ప్రస్తుతం 9వ తరగతిలో 10 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో 4 వేల మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతుండగా 6 వేల మంది ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నారు. 90 శాతం ప్రైవేట్ పాఠశాలలు ఇదే రీతిని అనుసరిస్తుండడంతో సుమారు 5వేల మంది విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడుతోంది. ఒక్కరి నుంచి పుస్తకాలకే రూ.15 వేల వరకూ వసూలు చేస్తున్నారు. దీనికి తోడు వచ్చే సంవత్సరం చెల్లించాల్సి మొత్తం ఫీజులో సగం ఇప్పుడే చెల్లించాలని శరతు విధిస్తుండడంతో తల్లిదండ్రులకు తలకు మించిన భారంగా మారుతోంది.
పట్టించుకోని అధికారులు
జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలు ఆవరణలోనే దుకాణాలు తెరిచి పుస్తకాలు, నోట్‌బుక్స్, పెన్నులు, బ్యాగ్‌లు, యూనిఫాం విక్రయిస్తూ వేల రూపాయల వ్యాపారం చేస్తున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. తల్లిదండ్రులు ఫిర్యాదులు చేస్తున్నా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. జిల్లా కలెక్టర్ తరచూ ప్రభుత్వ పాఠశాలలను తనఖీ చేస్తున్నా ప్రైవేట్ వైపు వెళ్లక పోవడంతో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా కలెక్టర్ ప్రైవేట్ పాఠశాలలను కూడ తనిఖీ చేయాలని విద్యార్థుల తల్లి దండ్రులు కోరుతున్నారు.
నిబంధనల ప్రకారం 9వ తరగతి విద్యార్థులకు జూనియర్ టెన్త్ పేరుతో తరగతులు నిర్వహించ కూడదు. అలా చేస్తున్నట్లు మాకు ఫిర్యాదులు రాలేదు. ప్రైవేట్ పాఠశాలలను తనిఖీ చేసి తరగతులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటాము.
– సలీం షరీఫ్, ఎంఈఓ కోదాడ
జూనియర్ ‘టెన్త్’ పేరుతో సరికొత్త విద్యా వ్యాపారం మెటీరియల్ కొనుగోలు చేసేందుకు
రూ.15 వేల నుంచి 20 వేలు
మొత్తం ఫీజులో సగం అడ్వాన్స్‌గా
చెల్లించాలని డిమాండ్
జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల
ముందస్తు వసూళ్లు
కోదాడలో కార్పొరేట్ దందా..
కోదాడలో ఉన్న ఓ కార్పొరేట్ పాఠశాల జూనియర్ టెన్త్ పేరుతో నెల రోజుల నుంచి 10వ తరగతి పాఠాలు బోధిస్తున్నారు. తమ మూడు బ్రాంచ్‌లలో ఉన్న సుమారు 150 మంది విద్యార్థులకు తమ సంస్థకు చెందిన ప్రత్యేక మెటీరియల్ అంట గడుతున్నారు. ఇందుకోసం ఒక్కో విద్యార్థి నుంచి రూ.18 వేల వసూలు చేస్తున్నారు. తమ సంస్థలో చదివే వారు ఈ పుస్తకాలు కొనాల్సిందేనని చెప్పడంతో తల్లిదండ్రులు విధిలేక కొంటున్నారు. దీంతో పాటు ఐపీఎల్, టెక్నో పేరుతో సెక్షన్‌లను ఏర్పాటు చేసి మరికొన్ని అదనపు పుస్తకాలను అంటగడుతున్నారు. ఇందుకోసం పట్టణంలో ఓ దుకాణాన్ని అద్దెకు తీసుకొని లారీల్లో పుస్తకాలను తీసుకొచ్చి అమ్మకాలు చేస్తున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వీరిని చూసి మిగిలిన ప్రైవేటు పాఠశాలలు తామేమి తక్కువ కాదన్నట్లు విద్యార్థుల నుంచి వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి.


