అనంతగిరి : భారతదేశ సంస్కృతిలో మహిళలకు ప్రత్యేక స్థానం ఉందని, దానిని పునికి పుచ్చుకున్న వారంతా మహిళలను గౌరవించాలని ‘మా ఊరు– మహాలక్ష్మి’ కార్యక్రమ వ్యవస్థాపకుడు నెల్లూరి సత్యనారాయణ అన్నారు. ఆదివారం అనంతగిరి మండలం గోండ్రియాల గ్రామంలో నిర్వహించిన ‘మా ఊరు– మహాలక్ష్మి’ వార్షికోత్సవ సభలో ఐదుగురు ఆడశిశువులకు ఒక్కొక్కరికి రూ.15వేల చొప్పున అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో పుట్టిన ప్రతి ఆడబిడ్డకు మా ఊరు మహాలక్ష్మి కానులను అందిస్తున్నట్లు తెలిపారు. కుల, మతాలకు అతీతంగా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న గ్రామ ప్రజలకు, ఎన్‌ఆర్‌ఐలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం గ్రామంలో పుట్టిపెరిగి వివిధ రంగాల్లో రాణిస్తున్న 40 మందిని ఘనంగా సన్మానించారు. షూటింగ్ బాల్ క్రిడలో అంతర్జాతీయ స్థాయిలో బంగారు పతకాన్ని సాధించిన గోండ్రియాల గ్రామానికి చెందిన గార్లపాటి శిరీషను గ్రామస్తులు సన్మానించారు. చుంచులక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంఈఓ తల్లాడ శ్రీనివాస్, మా ఊరు మహాలక్ష్మి కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, వివిధ రంగాలలో పని చేస్తున్న మహిళలు పాల్గొన్నారు.


