ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాం : ఎస్పీ
సూర్యాపేటటౌన్ : జిల్లాలో ప్రశాంతంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా పనిచేసినట్లు ఎస్పీ నరసింహ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో మూడు విడతల్లో 23 మండలాల్లో జరిగిన ఎన్నికలకు పోలీస్ సిబ్బంది ఒక జట్టుగా సమన్వయంతో పనిచేశారని కొనియాడారు. సిబ్బంది ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేశారు. సహకరించిన ఇతర శాఖల అధికారులు, ఓటర్లకు పోలీస్ శాఖ తరపున ధన్యవాదాలు తెలిపారు. గ్రామాల్లో తనిఖీలు నిర్వహించడం ద్వారా ఇప్పటి వరకు రూ.1.20 లక్షల నగదుతో పాటు, 144 కేసుల్లో సుమారు రూ.10.53 లక్షలు విలువ గల 1,740 లీటర్ల మద్యాన్ని పోలీసులు వివిధ ప్రాంతాల్లో స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఎన్నిక సందర్భంగా లెసెన్స్ కలిగి ఉన్న 79 తుపాకులను తాత్కాలికంగా స్వాధీనం చేసుకోవడంతో పాటు, గతంలో ఎన్నికల్లో గొడవలకు పాల్పడిన వ్యక్తులు, రౌడీ షీటర్లు, అనుమానాస్పద వ్యక్తులకు సంబంధించి ముందస్తుగా 429 కేసుల్లో 1488 మందిని బైండోవర్ చేసినట్లు వివరించారు.
మట్టపల్లిలో ధనుర్మాస పూజలు
మఠంపల్లి: మట్టపల్లి దేవాలయంలో ధనుర్మాసోత్సవంలో భాగంగా శ్రీలక్ష్మీనరసింహస్వామికి, గోదాదేవి అమ్మవారికి గురువారం తెల్లవారుజామున పాశురాలు పారాయణం చేస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు కుమ్మరికుంట్ల బదరీనారాయణాచార్యులు ఆధ్వర్యంలో ధనుర్మాస పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, కృష్ణమాచార్యులు , పద్మనాభాచార్యులు, బ్రహ్మాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, చైన్నెకి చెందిన పలువురు భక్తులు పాల్గొన్నారు.
యువజన సంఘాల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
భువనగిరి: 2025– 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి క్రీడా సామగ్రి పంపిణీ కోసం యువజన సంఘాల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మేరా యువ భారత్ ఉమ్మడి నల్లగొండ జిల్లా అధికారి గంట రాజేష్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రిజిస్ట్రేషన్ చేసుకుని నెహ్రూ యువ కేంద్రంలో అనుసంధానమైన యువజన సంఘాల వారు ఈ నెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. దరఖాస్తుతోపాటు గత 5 సంవత్సరాల నుంచి సంఘాలు చేసిన కార్యక్రమాల వివరాలు, రిజిస్ట్రేషన్ కాపీని జత పర్చాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 91338 96009, 90597 98602 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
అధ్యయనోత్సవాల ప్రచార పోస్టర్లు ఆవిష్కరణ
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఈ నెల 30న నిర్వహించే ముక్కోటి ఏకాదశి, అధ్యయనోత్సవాలకు సంబంధించిన ప్రచార పోస్టర్లను ఆలయ ఈఓ వెంకట్రావ్, అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి గురువారం ఆవిష్కరించారు. పోస్టర్లను గర్భాలయంలో, ముఖ మండపంలోని సువర్ణ పుష్పార్చన మూర్తుల చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ఈఓ మాట్లాడుతూ... ముక్కోటి ఏకాదశి వేడుకలకు భక్తులందరిని ఆహ్వానించేందుకు ప్రచార పోస్టర్లను రాష్ట్ర వ్యాప్తంగా పంపిస్తున్నామన్నారు. ధర్మ ప్రచారంలో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో నిర్థిష్ట తేదీల్లో శ్రీస్వామి వారి కల్యాణం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయాధికారులు రఘు, రాజన్‌బాబు, ఆర్‌ఐ శేషగిరిరావు, ప్రధానార్చకులు–2 సురేంద్రచార్యులు, అర్చకులు లక్ష్మణాచార్యులు తదితరులున్నారు.
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాం : ఎస్పీ
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాం : ఎస్పీ


