పదికి మూడు నెలలే కీలకం
వంద శాతం లక్ష్యం సాధించాలి
నాగారం : పదో తరగతి వార్షిక పరీక్షలకు మరో మూడు నెలల సమయం మాత్రమే ఉంది. మార్చి 14 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇప్పటికే విద్యా శాఖ టైంటేబుల్ విడుదల చేసింది. గతంలో ఎన్నడూలేని విధంగా నాలుగు రోజులకో పరీక్ష చొప్పున నిర్వహించనున్నారు. దీంతో విద్యార్థులపై ఒత్తిడి తగ్గనుందని విద్యా శాఖ భావిస్తోంది. అయితే విద్యార్థులు, ఉన్న ఈ కాస్త సమయాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రణాళిక ప్రకారం చదవడం, పునశ్చరణ, సాధనతో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు.
‘సంకల్పం’ పేరుతో ప్రత్యేక తరగతులు
పదో తరగతిలో మెరుగైన ఫలితాల సాధనకు జిల్లా విద్యా శాఖ ఇప్పటికే ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. సెప్టెంబర్ మొదటి వారం నుంచి ‘సంకల్పం’ పేరుతో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోంది. రోజూ సాయంత్రం 4.15 నుంచి నుంచి 5.15 వరకు గంటపాటు ఉన్నత పాఠశాలల్లో టెన్త్ విద్యార్థులకు వీటిని నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఒక టైం టేబుల్‌ను సైతం సిద్ధం చేశారు. ఏ రోజు ఏ సబ్జెక్టు బోధించాలనేది అందులో పేర్కొన్నారు. జనవరి నుంచి రెండు పూటలా తరగతులు నిర్వహించనున్నారు.
గతేడాది ఉత్తీర్ణత..
2024–25 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఫలితాల్లో జిల్లాలో 96.81 శాతం ఉత్తీర్ణత సాధించింది. రాష్ట్ర స్థాయిలో జిల్లా 14వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది జిల్లాలో 5,345 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి విద్యను అభ్యసిస్తున్నారు. వీరంతా ఉత్తమ మార్కులు సాధించేలా మిగిలిన ఈ మూడు నెలల సమయాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేలా ఉపాధ్యాయులు, విద్యార్థులు సన్నద్ధం కావాలి.
ప్రత్యేక శ్రద్ధ..
ఉపాధ్యాయలు సీ–గ్రేడ్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వారి సందేహాలను నివృత్తి చేస్తున్నారు. అలాగే విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందేలా చేయడంతోపాటు, సిలబస్ త్వరితగతిన పూర్తిచేసి పునశ్చరణపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
పదో తరగతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణులను చేయడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు ముందుకు వెళ్లాలి. ప్రత్యేక తరగతులకు తప్పనిసరిగా రిజిస్టర్ నిర్వహించాలి. పర్యవేక్షణ అధికారుల సలహాలు, సూచనలు సేకరించాలి. సబ్జెక్టు టీచర్లు సమన్వయంతో లక్ష్యం సాధించేందుకు శ్రమించాలి.
–అశోక్, జిల్లా విద్యా శాఖ అధికారి
ఫ మార్చి 14 నుంచి టెన్త్ వార్షిక పరీక్షలు
ఫ ఇప్పటికే టైంటేబుల్ విడుదల చేసిన విద్యా శాఖ
ఫ మెరుగైన ఫలితాల సాధనకు ‘సంకల్పం’
ఫ జనవరి నుంచి రెండు పూటలా ప్రత్యేక తరగతులు
జెడ్పీహెచ్‌ఎస్‌లు 182
కేజీబీవీలు 18
ఆదర్శ పాఠశాలలు 09
టెన్త్ విద్యార్థుల సంఖ్య 5,345
పదికి మూడు నెలలే కీలకం


