పెన్షనర్ల ఆరాధ్యుడు డీఎస్ నకారా
భానుపురి (సూర్యాపేట) : పెన్షనర్ల ఆరాధ్యుడు డీఎస్ నకారా అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్.సీతారామయ్య పేర్కొన్నారు. గురువారం సూర్యాపేట పట్టణంలోని ఆర్యవైశ్య కల్యాణ మండపంలో సంఘం సూర్యాపేట జిల్లాశాఖ, నోడల్ మండల శాఖ సంయుక్తంగా నిర్వహించిన పెన్షనర్స్ డే సమావేశానికి హాజరై మాట్లాడారు. పెన్షనర్ల తరఫున సుప్రీం కోర్టులో కొట్లాడి పెన్షన్ సాధించిన ఘనత డీఎస్ నకారాకు దక్కుతుందన్నారు. పెన్షన్ ప్రతీ ఉద్యోగి ప్రాథమిక హక్కు అని, పెన్షన్ గత సేవలకు ప్రతిఫలం మాత్రమేనని తెలిపారు. పెన్షన్ రద్దు చేసే అధికారం ఏ ప్రభుత్వానికి లేదన్నారు. అనంతరం పలువురు పెన్షనర్లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు బొల్లు రాంబాబు, సూర్యాపేట డీటీఓ ఎస్.రవికుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి దండ శ్యాంసుందర్ రెడ్డి, కోశాధికారి ఎస్.ఏ.హమీద్‌ఖాన్, అసోసియేట్ అధ్యక్షుడు కె.రవీందర్ రెడ్డి, టి.లక్ష్మీకాంతారెడ్డి, గౌరవ అధ్యక్షుడు కె.రవీందర్‌రెడ్డి, ఎస్.యాదగిరి, ఎస్.నాగేశ్వరరావు, శ్రీనివాసరావు, విట్టల్ రెడ్డి పాల్గొన్నారు.


