మూడో విడతలో కాంగ్రెస్ 78
సీపీఐ రెండు చోట్ల..
భానుపురి (సూర్యాపేట) : మూడో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ పల్లె ఓటర్లు అధికారపార్టీ మద్దతుదారులకు జైకొట్టారు. రెండు విడతలతో పోల్చితే తుదిదశ ఎన్నికలు ఏకపక్షంగా సాగాయి. హుజూర్‌నగర్ రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సొంత నియోజకవర్గం కావడంతో ఆ పార్టీ బలపర్చిన అభ్యర్థులకు తిరుగు లేకుండా పోయింది. ఇప్పటికే ఏకగ్రీవంగా 20 పంచాయతీలను గెలుచుకున్న ఆ పార్టీ బలపర్చిన అభ్యర్థులు మరో 78 స్థానాల్లో జయకేతనం ఎగురవేశారు. 10 స్థానాల్లో ఆ పార్టీకి చెందిన రెబల్ అభ్యర్థులే గెలుపొందారు. బీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థులు 29 మంది మాత్రమే గెలిచారు. ఇక స్వంతంత్ర అభ్యర్థులు ఏడు స్థానాలు గెలవగా.. బీజేపీ బలపర్చిన అభ్యర్థులు ఖాతా తెరవలేకపోయారు.
ఏకపక్షంగా కాంగ్రెస్..
హుజూర్‌నగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఏడు మండలాల్లో 146 గ్రామపంచాయతీలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో 20 స్థానాలను కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలుచుకున్నారు. మరో రెండింటిని స్వంతంత్ర అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మిగిలిన 124 స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా అధికార కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు 78 స్థానాల్లో జయకేతనం ఎగురవేశారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కీలక శాఖలను నిర్వహిస్తుండడం ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థుల గెలుపునకు బాటలు వేసింది. అదే పార్టీలో నాయకులుగా కొనసాగి సర్పంచ్ పదవి ఆశించినా.. సీటురాకపోవడంతో రెబల్ అభ్యర్థులుగా నిలిచి గెలిచారు.
నాయకత్వ లేమి..
బీఆర్‌ఎస్ 29స్థానాల్లో గెలిచింది. ఇక్కడ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి పోటీచేసిన శానంపూడి సైదిరెడ్డి బీజేపీలో చేరగా.. నాటినుంచి నియోజకవర్గంలో నాయకత్వ లేమి కనిపిస్తోంది. గరిడేపల్లి, మఠంపల్లి మండలాలు మినహా ఎక్కడా ప్రభావం చూపలేకపోయింది. మొదటి విడతలో కాస్త పోటీ ఇచ్చినా.. రెండు, మూడోవిడత పంచాయతీ ఎన్నికల్లో ఏ మాత్రం పోటీ కూడా ఇవ్వలేకపోయారు.
ఊసేలేని బీజేపీ..
హుజూర్‌నగర్ నియోజకవర్గానికి చెందిన చల్లా శ్రీలతారెడ్డి ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. అయినా ఈ ప్రాంతంలో బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఒక్కటంటే ఒక్క స్థానం కూడా ఆ పార్టీ బలపర్చిన అభ్యర్థులు గెలవలేకపోయారు. ఓ వైపు జిల్లా అధ్యక్షురాలు, మరో వైపు గతంలో హుజూర్‌నగర్ ఎమ్మెల్యేగా పనిచేసిన శానంపూడి సైదిరెడ్డి కూడా తన అనుచర వర్గాన్ని గెలిపించుకోలేకపోవడంతో ఖాతా తెరవలేకపోయింది.
ఫ రాష్ట్ర మంత్రి ఇలాఖా
హుజూర్‌నగర్‌లో దూసుకెళ్లిన పార్టీ
ఫ 29చోట్ల బీఆర్‌ఎస్
మద్దతుదారుల విజయం
సీపీఐ బలపర్చిన అభ్యర్థులు రెండు స్థానాలను కై వసం చేసుకున్నారు. ఈ రెండు స్థానాలు కూడా గరిడేపల్లి మండలంలోని ఆ పార్టీ చేజిక్కించుకుంది. స్వతంత్ర అభ్యర్థులు ఐదుచోట్ల ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
మూడో విడతలో కాంగ్రెస్ 78


