ప్రచారానికి తెర.. ప్రలోభాల ఎర
హుజూర్‌నగర్ : తుది దశ పంచాయతీ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రంతో పరిసమాప్తం అయ్యింది. హుజూర్‌నగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఏడు మండలాల్లో బుధవారం ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరగనుంది. ఓటర్లను మచ్చిక చేసుకోవడానికి అభ్యర్థులు ఎవరికివారు గప్‌చుప్‌గా ప్రలోభాల ఎరకు తెరలేపారు. డబ్బు, మద్యం, చికెన్ పంపిణీతో పాటు విందులు సన్నాహాలు చేస్తున్నారు. చివరి రోజు ప్రచారం హోరాహోరీగా సాగింది. తమ పార్టీ మద్దతుదారులను గెలిపించేందుకు ప్రధాన పార్టీల నేతలు జోరుగా ప్రచారం నిర్వహించారు.
విజయమే లక్ష్యంగా..
హుజూర్‌నగర్, చింతలపాలెం, గరిడేపల్లి, మఠంపల్లి, మేళ్లచెరువు, నేరేడుచర్ల, పాలకవీడు మండలాల్లో సర్పంచ్, వార్డు అభ్యర్థులు ఆయా గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. చివరి రోజు సోమవారం సైతం తమ గుర్తుల ప్రచారంతో హోరెత్తించారు. బహిరంగ ప్రచారం ముగిసిన వెంటనే అభ్యర్థులు ప్రలోభాలకు తెరలేపారు. ప్రధానంగా జనరల్, బీసీ స్థానాల అభ్యర్థుల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ప్రచారం ముగియగానే సాయంత్రం, రాత్రి వేళల్లో అభ్యర్థులు.. తమ ప్రత్యర్థులు ఓటుకు ఎంత ఇస్తున్నారో తెలుసుకుని అంతకంటే కొంత ఎక్కువ ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఎలాగైనా గెలిచితీరాలని డబ్బు, మద్యంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు తమ వంతు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కో ఓటుకు రూ. వెయ్యి నుంచి రూ. 3 వేలకు పైగా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇప్పటికే ఓటర్ల జాబితా ఆధారంగా తమకు పడే ఓట్ల కోసం తమ నమ్మకస్తులతో గుట్టుచప్పుడు కాకుండా డబ్బుల పంపిణీకి రంగం సిద్ధం చేశారు. ఇదిలా ఉండగా.. ఏ దారిలో ఓటరుకు డబ్బులు చేరవేయాలని అభ్యర్థులు చూస్తుంటే.. డబ్బులు ఎవరు? ఎంత పంచుతున్నారు అని ఓటర్లు ఆరా తీస్తుండటం గమనార్హం.
ఖర్చుకు వెనుకాడకుండా..
నామినేషన్ల ఉపసంహరణ రోజు నుంచి కొందరు నాయకులు, సానుభూతిపరులను మద్యం మత్తులో ముంచేశారు. ఇప్పుడు ఓటర్లు చేజారకుండా ఉండేందుకు అభ్యర్థులు ఆయా ఓటర్లను వారి వాడలో ప్రత్యేక సిట్టింగులు ఏర్పాటు చేశారు. ఇందుకోసం మద్యం పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి వారికి తాగినంత అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇదే వాతావరణం నేడు, రేపు రెండు రోజుల పాటు పోటీలో ఉన్న అభ్యర్థులకు తప్పేలా లేదని తెలుస్తోంది. తొలుత ఎన్నికల్లో ఖర్చు పెట్టేందుకే ఆలోచించిన అభ్యర్థులు పోలింగ్ సమయం దగ్గర పడటంతో అప్పుతెచ్చిమరీ ఒకరిని మించి మరొకరు ఖర్చు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. పలువురు అభ్యర్థులు తమకు వచ్చిన ఎన్నికల గుర్తులను ఓటర్లకు పంచుతున్నారు. ప్రధానంగా ఉంగరం గుర్తు వచ్చిన అభ్యర్థులు కొందరు వెండి, రాగి ఉంగరాలు అందజేస్తున్నట్లు సమాచారం. స్టూలు గుర్తు వచ్చిన వారు వాటిని పంచుతున్నట్లు తెలిసింది. ఇంకా మిక్సీలు, చీరలు, సెల్‌ఫోన్‌లు, క్రికెట్ బ్యాట్‌లు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం.
జోరుగా ఎన్నికల ప్రచారం..
మూడో విడత ఎన్నికలు జరుగుతున్న హుజూర్‌నగర్, చింతలపాలెం, గరిడేపల్లి, మఠంపల్లి, మేళ్లచెరువు, నేరేడుచర్ల, పాలకవీడు మండలాల్లో చివరి రోజైన సోమవారం ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. అభ్యర్థులు ఇంటింటికీ తిరిగి తమను గెలిపిస్తే గ్రామాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తామని హామీల వర్షం కురిపించారు. అంతే కాకుండా తమ గ్రామాల పరిధిలో ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక మేనిఫెస్టోను కూడా ఓటర్లకు పంచారు.
ముగిసిన మూడో దశ
పంచాయతీ ఎన్నికల ప్రచారం
మద్యం, డబ్బు, మాంసం పంపిణీ
ఓటర్లను మచ్చిక చేసుకోవడానికి
అభ్యర్థుల పాట్లు
రేపే హుజూర్‌నగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఏడు మండలాల్లో పోలింగ్


