నిషేధాజ్ఞలు అమలు
● కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్
భానుపురి (సూర్యాపేట) : గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో నిషేధాజ్ఞలు అమలులో ఉన్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి తేజస్ నంద్ లాల్ పవార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాశాంతికి, ప్రశాంతతకు భంగం కలించే, పంచాయతీ ఎన్నిలకు అడ్డంకులు, అసౌకర్యం అల్లర్లు లేదా ఘర్షణ కలిగించే అవకాశం ఉన్న వాటిని నివారించడానికి ఈ నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. ముందస్తు రాతపూర్వక అనుమతి లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో బహిరంగ సమావేశాలు, ప్రదర్శనలు, ఊరేగింపులు, ర్యాలీలు నిర్వహించకూడదని సూచించారు. ఈ నిషేధాజ్ఞలు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తాయని, పురపాలక ప్రాంతాలకు వర్తించవని ఆయన స్పష్టం చేశారు. ఏ వ్యక్తి తన వద్ద ఆయుధాలు, పేలుడు పదార్థాలు, ఈ ఉత్తర్వు అమలులో ఉన్న కాలంలో బహిరంగ ప్రదేశాలలోకి తీసుకొని వెళ్లకూడదని సూచించారు.
క్యాన్సర్‌పై అవగాహన
కల్పించాలి
సూర్యాపేటటౌన్ : పద్నాలుగేళ్ల వయసు కలిగిన బాలికలకు సర్వైకల్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ పెండెం వెంకటరమణ సూచించారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో జిల్లా వైద్యాధికారులకు హెచ్‌పీవి వ్యాక్సిన్ సన్నద్ధతపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ దేశంలోసర్వైకల్ క్యాన్సర్ అధికంగా ఉందని, మరణాలు కూడా అధికంగా సంభవిస్తున్నాయన్నారు. హెచ్‌పీవి(హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాక్సిన్ ద్వారా 83శాతం సర్వైకల్ క్యాన్సర్ రాకుండా నియంత్రించవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ కోటి రత్నం, డాక్టర్ జి.చంద్రశేఖర్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ ప్రదీప్, డాక్టర్ అశ్రిత, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మట్టపల్లిలో నిత్యకల్యాణం
మఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో సోమవారం శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి నిత్యకల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లకు ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు చేశారు. శ్రీస్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవం చేపట్టారు. అనంతరం కల్యాణం జరిపి స్వామి అమ్మవార్లను ఆలయ తిరుమాడ వీధుల్లో గరుడ వాహనంపై ఊరేగించారు. ఆ తర్వాత మహానివేదనతో భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీచేశారు. అలాగే క్షేత్రంలోని శివాలయంలో శ్రీపార్వతీ రామలింగేశ్వరస్వామికి ఏకాదశ రుద్రాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ జ్యోతి, అర్చకులు కృష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, దుర్గాప్రసాద్‌శర్మ, సీతారామాచార్యులు పాల్గొన్నారు.
యాదగిరి క్షేత్రంలో ఏకాదశి పూజలు
యాదగిరిగుట్ట : ఏకాదశి సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధానాలయ ముఖ మండపంలో వజ్రవైడూర్యాలతో అలంకృతులైన ఉత్సవమూర్తులకు ఆగమశాస్త్రం ప్రకారంగా వూదమంత్ర పఠనాలతో అర్చకులు లక్ష పుష్పార్చన చేశారు.ఈ వేడుకలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఇక వేకువజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు అభిషేకం చేసి, తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం ప్రాకారమండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, స్వామి, అమ్మవారికి నిత్య తిరుకల్యాణం, బ్రహ్మోత్సవం, ఆరాధనలు చేపట్టారు.


