మానవ హక్కుల పరిరక్షణకు కృషి
కోదాడ: సమాజంలో మానవ హక్కుల పరిరక్షణకు కృషి చేస్తానని తెలంగాణ పోలీస్ కంప్లెయింట్ అథారిటీ మెంబర్ వర్రె వెంకటేశ్వర్లు యాదవ్ అన్నారు. మానవహక్కుల దినోత్సవం సందర్భంగా సమాచార హక్కు వికాస సమితి ఆధ్వర్యంలో మంగళవారం కోదాడ పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి పౌరుడు నైతిక విలువలతో జీవించి మానవహక్కుల రక్షణలో భాగస్వామి కావాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే సమాజంలో ప్రతి పౌరుడు తమ హక్కులను స్వేచ్ఛగా పొందగలరన్నారు. విద్యాహక్కు కోసం పిల్లలు ఎదురు చూస్తున్నారని భద్రత కోసం మహిళలు పోరాడుతున్నారని అన్నారు. ఇండియన్ జస్టిస్ రిపోర్టు 2024 ప్రకారం దేశంలోనే తెలంగాణా రాష్ట్రం పోలీసింగ్ వ్యవస్థలలో నంబర్ 1 స్థానంలో నిలవడం ఇక్కడి పోలీసులు పనితీరుకు నిదర్శనం అని అన్నారు. రాబోయే రోజుల్లో శాంతిభద్రతల విషయంలో తెలంగాణ పోలీసులు మరింత సమర్థంగా పని చేసి రాష్ట్రానికి పేరు తీసుకురావాలని కోరారు. తన విధులు సక్రమంగా నిర్వర్తించి పోలీస్ వ్యవస్థలో పెనుమార్పులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. అనంతరం సమాచార హక్కువికాస సమితి అధ్యక్షుడు ఎర్రమాద కృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ పోలీస్ కంప్లెయింట్ అథారిటీ మెంబర్‌గా డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లును ప్రభుత్వం నియమించడం అభినందనీయం అని అన్నారు. కార్యక్రమంలో వికాస సమితి జిల్లా అధ్యక్షుడు శివ, సత్యనారాయణ, వెంకటరెడ్డి, సైదులు, శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.
ఫ తెలంగాణ పోలీస్ కంప్లెయింట్
అథారిటీ మెంబర్ వర్రె వెంకటేశ్వర్లు


