మోంథా ప్రభావంతో 64,939 ఎకరాల్లో పంటలకు నష్టం
సూర్యాపేట : మోంఽథా తుపాన్ రైతన్నకు గుండెకోతను మిగిల్చింది. వేల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంట చేతికొచ్చే సమయంలో నీటిపాలైంది. రెండు రోజులు కురిసిన వర్షానికి జిల్లాలో సుమారు 64,939 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఈ నష్టం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. పూర్తిస్థాయి నష్టం అంచనా కోసం మరో రెండురోజుల పాటు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించనుంది. ప్రధానంగా వరి పంట వేలాది ఎకరాల్లో చేతికి రాకుండా వరద పాలు అయ్యింది. ఇక వరదల కారణంగా రోడ్లు, విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. జిల్లాలో అధిక వర్షాల ప్రభావాన్ని క్షేత్రస్థాయిలో తెలుకునేందుకు కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ పలు మండలాల్లో విస్తృతంగా పర్యటించారు.
ప్రధానంగా రెండుపంటలే..
మోంథా తుపాన్ కారణంగా బుధవారం అతి భారీ నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. ప్రస్తుతం జిల్లాలో వరి కోతలు, పత్తితీత పనులు ముమ్మరంగా సాగే సమయం. ఈ క్రమంలో కురిసిన అధిక వర్షాలు రైతన్నను నిండా ముంచాయి. కోతకు వచ్చిన పొలాలు వరద పాలయ్యాయి. జిల్లాలో 15,510 మంది రైతులకు చెందిన 54,006 ఎకరాల వరి పొలాలు తుపాన్ ధాటికి దెబ్బతిన్నాయి. అలాగే 3,597 మంది రైతులకు చెందిన 10,933 ఎకరాల పత్తి పంటకు నష్టం వాటిల్లింది. మండలాల వారీగా పరిశీలిస్తే.. వరి పంటకు అత్యధికంగా జాజిరెడ్డిగూడెం మండలంలో 6,164 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. ఆ తర్వాత గరిడేపల్లి మండలంలో 5960 ఎకరాలు, నేరేడుచర్లలో 5600 ఎకరాలు, పాలకవీడులో 5524, కోదాడలో 4650 ఎకరాల్లో రైతులు నష్టపోయారు. అయితే వర్షపాతం ఎక్కువగా నమోదైన తుంగతుర్తి మండలంలో కేవలం 80 ఎకరాలు, తిరుమలగిరి మండలంలో 12 ఎకరాలు, నూతనకల్‌లో 55 ఎకరాలు, మద్దిరాలలో 180 ఎకరాలు, ఆత్మకూర్ (ఎస్)లో 856 ఎకరాల్లో మాత్రమే వరి పంటకు నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. పత్తి అత్యధికంగా మోతె మండలంలో 3,600 ఎకరాల్లో రైతులు నష్టపోవాల్సి వచ్చింది. ఈ రెండు పంటలు కలిపి నడిగూడెం మండలంలో అత్యధికంగా 7,564 ఎకరాల్లో నష్టం వాటిల్లినట్లు తేలింది.
ఇతర శాఖలకు సంబంధించి..
వ్యవసాయ శాఖ తర్వాత అధిక వరదలతో ఆర్‌అండ్‌బీ శాఖ తీవ్రంగా నష్టపోయింది. దాదాపు రూ.85 లక్షల మేర రోడ్లు, బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి. ఇందులో గుండ్ల సింగారం బ్రిడ్జికి రూ.30 లక్షలు, హుజూర్‌నగర్ రోడ్లకు రూ.50 లక్షలు, దొండపహాడ్ రోడ్డు డ్యామేజీకి రూ.5 లక్షల చొప్పున నష్టం వాటిల్లినట్లు సంబంధిత శాఖ అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. విద్యుత్ శాఖ పరిఽధిలో జిల్లావ్యాప్తంగా 72 ఎల్టీ స్తంభాలు, 22 హెచ్‌టీ స్తంభాలు, 5 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. వీటి విలువ సుమారు రూ.30 లక్షల దాకా ఉంటుందని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. రెవెన్యూ శాఖ పరిధిలో 10 ఇళ్లు పాక్షికంగా, 1 ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఇందులో సూర్యాపేట డివిజన్ పరిధిలో 7 ఇళ్లు పాక్షికంగా, 3 ఇళ్లు కోదాడ డివిజన్‌లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పూర్తిగా ధ్వంసమైన ఇల్లు కోదాడ డివిజన్ పరిధిలో ఉంది. ఇరిగేషన్ శాఖ అధికారుల ముందస్తు చర్యల కారణంగా ఎలాంటి నష్టం వాటిల్లలేదు. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ శాఖకు ఏమాత్రం నష్టం వాటిల్లినా.. పంటలు, ఇతర శాఖల ఆస్తులకు పెద్ద ఎత్తున డ్యామేజీ జరిగేదని అధికారులు భావిస్తున్నారు.
నూతనకల్: మిర్యాలలో పత్తి పంటను పరిశీలిస్తున్న కలెక్టర్ తేజస్‌నందలాల్ పవార్
మోంథా ప్రభావంతో 64,939 ఎకరాల్లో పంటలకు నష్టం


