నేడు రన్‌ఫర్ యూనిటీ
సూర్యాపేటటౌన్ : ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 6 గంటలకు సూర్యాపేట పట్టణంలోని ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజీ చౌరస్తా నుంచి మినీ ట్యాంక్ బండ్ వరకు రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్పీ నరసింహ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. ఈరన్‌లో స్థానిక పౌరులు, యువత అధిక సంఖ్యలో పాల్గొని ఐక్యతను చాటాలని కోరారు.
ప్రజలు ప్రమాదాలకు దూరంగా ఉండాలి
సూర్యాపేటటౌన్ : వర్షాలు పడుతున్నందున ప్రజలు ప్రమాదాలకు దూరంగా ఉండాలని ఎస్పీ నరసింహ సూచించారు. సూర్యాపేట మండలం వెదిరెవారిగూడెం వద్ద మూసీ నదిపై బీమారం లోలెవల్ బ్రిడ్జి వద్ద నీటి ప్రవాహ పరిస్థితులను గురువారం ఆయన పరిశీలించి మాట్లాడారు. రెండు రోజులు కురిసిన వర్షాల వల్ల చెరువులు, కుంటలు, నదులు నిండి ప్రమాదకరస్థాయిలో ఉన్నాయన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రజల రక్షణలో పోలీసులు అనుక్షణం అప్రమత్తంగా పని చేస్తున్నారని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో సెలవులు రద్దు చేసి సిబ్బందిని అందుబాటులో ఉంచామని తెలిపారు. ఎస్పీ వెంట సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ రామారావు, ఎస్‌ఐ బాలునాయక్, సిబ్బంది ఉన్నారు.
విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
సూర్యాపేట : వర్షాల సమయంలో విద్యుత్ సిబ్బంది చాలా అప్రమత్తంగా ఉండాలని ఎస్‌పీడీసీఎల్ డైరెక్టర్ (కమర్షియల్ ) సీహెచ్ చక్రపాణి సూచించారు. మోంథా తుపాన్ ప్రభావంతో కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడిన ప్రాంతాలను గురువారం ఆయన సందర్శించారు. సూర్యాపేటలో ఉన్న 132 కేవీ సబ్ స్టేషన్‌లో విద్యుత్ సరఫరాను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుపాన్ కారణంగా విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక అధికారిని నియమించడంతో తాను ఇక్కడికి వచ్చి సమీక్షిస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట ఎస్‌ఈ ఫ్రాంక్లిన్, డీఈ శ్రీనివాస్, ఏఈలు, ఏడీలు, రామకృష్ణ ఉన్నారు.
ఎంజీయూ బ్యాక్‌లాగ్
ఫలితాలు విడుదల
నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని పీజీ విద్యార్థుల బ్యాక్‌లాగ్ పరీక్ష ఫలితాలను గురువారం విడుదల చేసినట్లు యూనివర్సిటీ సీఓఈ ఉపేందర్‌రెడ్డి తెలిపారు. మొదటి సెమిస్టర్‌లో 52.34 శాతం, రెండవ సెమిస్టర్‌లో 41.74 శాతం, మూడవ సెమిస్టర్‌లో 37.50 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు. బ్యాక్‌లాగ్ పరీక్ష ఫలితాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపర్చామని పేర్కొన్నారు.
నేడు రన్‌ఫర్ యూనిటీ


