రాష్ట్రంలో బీజేపీ ఆటలు సాగవు
రైతులకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లించాలి
హుజూర్‌నగర్ : ‘ తెలంగాణ రాష్ట్రాన్ని అనాథగా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోంది.. ఎన్ని కుయుక్తులు పన్నినా రాష్ట్రంలో బీజేపీ ఆటలు సాగవు’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. గురువారం హుజూర్ నగర్‌లో నిర్వహించిన సీపీఐ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో కూనంనేని మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడానికి గత ప్రభుత్వాలు చేసిన అప్పులు ఒక కారణమైతే, రాష్ట్రంతో కేంద్రం అనుసరిస్తున్న తీరు మరో కారణమన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సీపీఐ మద్దతు ఉంటుందని, కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గత త్యాగాల చరిత్రను ప్రజలకు చెప్పేందుకే ఖమ్మంలో సభ నిర్వహిస్తు న్నామన్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో కేంద్రంలో ఏర్పాటు చేసిన సంస్థలను బీజేపీ సర్కార్ ప్రైవేట్ పరం చేస్తోందన్నారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ తుపాన్‌తో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందజేయాలన్నారు. సీపీఐ పట్టణ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్, గన్నా చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, కంబాల శ్రీనివాస్, దేవరం మల్లేశ్వరి, ధనుంజయ నాయుడు, సృజన, ఉస్తేల నారాయణరెడ్డి, మండవ వెంకటేశ్వర్లు, సాహెబ్ అలి, మేకల శ్రీనివాస్, బద్దం కృష్ణారెడ్డి, పోకల వెంకటేశ్వర్లు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
చిలుకూరు: తుపాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం పరిహారం చెల్లించి ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరా రు. గురువారం చిలుకూరుకు చెందిన సీపీఐ నాయకుడు చిలువేరు అంజనేయులు కుమార్తె వివాహానికి సాంబశివరావు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం స్థానికంగా విలేకరులతో మాట్లాడారు. ప్రధానంగా ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం తదితర జిల్లాల్లో వర్షం వల్ల వరి, పత్తి, మిర్చి తదితర పంటలు దెబ్బతిన్నాయన్నారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గన్నా చంద్రశేఖర్, పార్టీ మండల సహాయ కార్యదర్శి సాహెబ్ అలీ, ఏఐవైఎఫ్ రాష్ట్ర నాయకులు చేపూరి కొండలు పాల్గొన్నారు.
ఫ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు


