తడిసిన ధాన్యంపై నివేదిక ఇవ్వాలి
భానుపురి (సూర్యాపేట) : వర్ష ప్రభావిత ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం ఉంటే వెంటనే నివేదిక ఇవ్వాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. గురువారం సూర్యాపేట కలెక్టరేట్‌లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. మోంథా తుపాన్ కారణంగా జిల్లాలో అధిక వర్షాలు కురుస్తాయని, అధికారులు, రైతులను ముందే అప్రమత్తం చేయడంతో ముప్పు తప్పిందన్నారు. ప్రధానంగా కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం రాశులపై టార్పాలిన్లు కప్పడంతో ఎక్కువగా తడవలేదన్నారు. అంచులు, అడుగు భాగాల్లో తడిస్తే వెంటనే మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాలను మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. అవసరం ఉన్న చోట ధాన్యాన్ని దగ్గరలోని ఫంక్షన్ హాల్ లో నిల్వ చేసుకోవాలని సూచించారు. కలెక్టరేట్‌లో 24 గంటల పాటు అందుబాటులో ఉండేలా 6281492368 నంబర్‌తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. ధాన్యం కొనుగోలు, వర్షంతో ఏదైనా సమస్య ఉంటే ఫిర్యాదు చేస్తే తక్షణమే పరిష్కరిస్తామన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్


