
అత్త, మామపై అల్లుడి దాడి
గుండాల: మద్యం మత్తులో అత్త, మామపై అల్లుడు దాడి చేయడంతో అత్త మృతి చెందింది. మామకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గుండాల మండలం సుద్దాల గ్రామంలో శనివారం రాత్రి జరిగింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా లింగాల ఘణపురం మండలం మాణిక్యపురం గ్రామానికి చెందిన గుగులోతు జున్నూబాయి(50), రాజయ్య దంపతుల కుమార్తె చుక్కవ్వను అదే గ్రామానికి చెందిన కాలియా బచ్చన్, లింగబాయి దంపతుల కుమారుడు కనకయ్యకు ఇచ్చి 16ఏళ్ల క్రితం వివాహం చేశారు. గుగులోతు జున్నూబాయి, రాజయ్య దంపతులు గుండాల మండలం సుద్దాల గ్రామానికి చెందిన గూడ పృథ్వీ మామిడి తోటను కౌలుకు తీసుకొని జీవనం సాగిస్తున్నారు. వ్యసనాలకు బానిసైన కనకయ్య ఇటీవల మరో మహిళ గౌరమ్మను పెళ్లి చేసుకొని గుండాల మండలం బూర్జుబావి గ్రామంలో ఇద్దరు భార్యలతో కలిసి మామిడి తోటను కౌలుకు తీసుకొని ఉంటున్నాడు. శనివారం రాత్రి మద్యం మత్తులో ఉన్న కనకయ్య సుద్దాల గ్రామంలో అత్తమామలు ఉంటున్న మామిడి తోట వద్దకు వచ్చి వారితో గొడవపడ్డాడు. ఈ క్రమంలో ఇనుప వస్తువుతో అత్త, మామపై దాడి చేయడంతో జున్నూబాయి అక్కడికక్కడే మృతి చెందింది. రాజయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. గుండాల గ్రామంలో మామిడి తోటను కౌలుకు తీసుకొని ఉంటున్న కాలె కృష్ణ ఆదివారం ఉదయం సుద్దాల గ్రామానికి వెళ్లి చూడగా రాజయ్య రక్తపు మడుగులో పడి ఉండటం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. మృతురాలి పెద్ద కుమార్తె కాలియా పెంటమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని గాయాలపాలైన రాజయ్యను చికిత్స నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి, జున్నూబాయి మృతదేహాన్ని ఆలేరు ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు చెప్పారు. ఘటనా స్థలాన్ని భువనగిరి డీసీపీ ఆకాంంక్ష్ యాదవ్, సీఐ శంకర్, ఎస్‌ఐ జి. సైదులు పరిశీలించారు.
అత్త మృతి
మామకు తీవ్ర గాయాలు