
ఉరేసుకొని మహిళ ఆత్మహత్య
కోదాడరూరల్: ఆర్థిక పరిస్థితులు బాగోలేక మానసికంగా కృంగిపోయిన మహిళ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కోదాడ మండలం కూచిపూడి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. కోదాడ రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ పట్టణానికి చెందిన నవ్య(22)కు కోదాడ మండలం కూచిపూడికి చెందిన సాయిబాబాతో నాలుగేళ్ల కిందట వివాహం జరిగింది. కుటుంబ ఆర్థిక పరిస్థితులు, మానసికంగా కూడా బాగోలేకపోవడంతో ఆదివారం భర్త బయటకు వెళ్లిన తర్వాత నవ్వ ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు చేసుకుంది. నవ్య కుమార్తె గేటు వద్ద ఏడుస్తూ కనిపించడంతో పక్కింటివాళ్లు వచ్చి ఇంట్లోకి వెళ్లి చూడగా నవ్య విగతజీవిగా కనిపించింది. మృతురాలి తల్లి వెంకటరమణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
వడదెబ్బతో దివ్యాంగుడు మృతి
పెన్‌పహాడ్: వడదెబ్బకు గురై దివ్యాంగుడు మృతి చెందాడు. ఈ ఘటన పెన్‌పహాడ్ మండలం అనంతారం గ్రామంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతారం గ్రామానికి చెందిన షేక్ లతీఫ్‌సాబ్ కుమారుడు ముజీబ్(30) శుక్రవారం సూర్యాపేటలో నిర్వహించిన దివ్యాంగులకు ట్రైసైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి ఎండలో వెళ్లి వచ్చి వడదెబ్బకు గురయ్యాడు. అతడిని కుటుంబ సభ్యులు సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు.
ఏఐవైఎఫ్ జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా వెంకటేశ్వర్లు
నల్లగొండ టౌన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతిలో ఈ నెల 15 నుంచి 18 వరకు జరిగిన ఏఐవైఎఫ్ జాతీయ మహాసభల్లో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో సంఘం నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి తీర్పారి వెంకటేశ్వర్లును ఏఐవైఎఫ్ జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఉరేసుకొని మహిళ ఆత్మహత్య