
వేధింపులు తాళలేక బావిలోకి దూకిన వివాహిత
ఆత్మకూరు(ఎం): భర్త, అత్తమామల వేధింపులు తాళలేక వివాహిత వ్యవసాయ బావిలో దూకింది. ఈ ఘటన ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూరు(ఎం) మండలం మొరిపిరాల గ్రామానికి చెందిన కటికె రాములు, మారెమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు. చిన్న కుమారుడు కటికె కృష్ణకు జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లి గ్రామానికి చెందిన కేమెడీ బైరయ్య, జయలక్ష్మి దంపతుల రెండో కుమార్తె సంధ్యతో ఏడాదిన్నర క్రితం వివాహమైంది. వివాహానికి ముందు కృష్ణ హైదరాబాద్‌లోని కృష్టవేణి టాలెంట్ స్కూల్‌లో పనిచేసేవాడు. వివాహం తర్వాత గ్రామంలోనే వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాడు. ఆరు నెలల నుంచి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆత్మకూరు(ఎం) పోలీస్ స్టేషన్‌లో సంధ్యపై కృష్ణ, జనగామ జిల్లా రఘునాథపల్లి పోలీస్ స్టేషన్‌లో కృష్ణపై సంధ్య పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో జీవతంపై విరక్తి చెందిన సంధ్య ఆదివారం సాయంత్రం ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలో సిద్ధాపురం రోడ్డు పక్కన వ్యవసాయ బావిలో దూకింది. సమీపంలో మామిడి చెట్టుకు కాపలాగా ఉన్న కుర్రాడు చూసి చుట్టుపక్కల వారికి సమామాచారం అందించాడు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ కృష్ణయ్య ఘటనా స్థలాన్ని చేరుకుని పరిశీలించారు. బావి గట్టుపై ఆధార్‌కార్డు, చెప్పుల జత, సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫైరింజన్ సహాయంతో వ్యవసాయ బావి నుంచి నీటిని తోడుతున్నారు. బావిలో నీరు చాలా ఉండటంతో రాత్రి 11.30గంటల వరకు కూడా సంధ్య ఆచూకీ లభించలేదు. తనను భర్త కృష్ణతో పాటు అత్త, మామ, బావ, తోటికోడలు వేధిస్తున్నారని, పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్యకు పరిష్కారం దొరక్కపోవడంతో తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సంధ్య సూసైడ్ నోట్‌లో రాసినట్లు తెలిసింది.
బావిలో నీటిని తొలగిస్తున్న ఫైర్ సిబ్బంది
గాలింపు చర్యలు ముమ్మరం