
15లోగా పూర్తిస్థాయి పరిశీలన చేయాలి
భానుపురి (సూర్యాపేట) : రాజీవ్ యువ వికాసం పథకం కింద నమోదైన దరఖాస్తులను ఈ నెల 15లోగా పూర్తిస్థాయిలో పరిశీలించి సంబంధిత బ్యాంకులకు పంపాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో రాజీవ్ యువ వికాసం పథకంపై అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజీవ్ యువ వికాసం కింద నమోదైన 60,107 దరఖాస్తులకు 56,606 పరిశీలన పూర్తయిందని, ఇప్పటివరకు 52,069 దరఖాస్తుల వివరాలను బ్యాంకులకు పంపించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస్ నాయక్, డీజీడీఓ శంకర్, డీడబ్ల్యూఓ జగదీశ్ రెడ్డి, ఎల్‌డీఎం బాపూజీ, వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, ఉద్యానశాఖ అధికారి నాగయ్య పాల్గొన్నారు.
రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి
ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సూచించారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ పి.రాంబాబుతో కలిసి సంబంధిత అధికారులతో వెబెక్స్ ద్వారా కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మిల్లుల వద్ద ధాన్యం లారీలను వేగంగా దిగుమతి చేసుకోనేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద లారీలు వచ్చిన వెంటనే ధాన్యం ఎగుమతి త్వరగా అయ్యేలా చూడాలన్నారు. గన్నీ బ్యాగుల కోసం ముందు రోజే వివరాలు పంపాలన్నారు. సమావేశంలో డీఆర్‌డీఓ వీవీ అప్పారావు, డీసీఓ పద్మ, సివిల్ సప్లయ్ డీఎం ప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, సీపీఓ కిషన్ నాయక్, మార్కెటింగ్ డీఎం శర్మ పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్