
కాంగ్రెస్ విజయానికి కృషిచేసిన వారికే పదవులు
తుంగతుర్తి: కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషిచేసిన కార్యకర్తలకే పదవులు వస్తాయని టీపీసీసీ పరిశీలకుడు, మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ అన్నారు. బుధవారం తుంగతుర్తిలో నిర్వహించిన మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మండల శాఖ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, గ్రామ శాఖల అధ్యక్షుల పదవుల కోసం అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీలో 2017 సంవత్సరం కన్నా ముందున్న వారు, ఎన్నికల్లో గెలుపు కోసం పోరాడిన వారు అర్హులవుతారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే మందుల సామేల్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. త్యాగాల చరిత్ర కాంగ్రెస్ పార్టీకే ఉందని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నిజాయితీగా పనిచేసే వారికి తగిన అవకాశాలు కల్పించడం నాయకత్వం బాధ్యత అని అన్నారు. కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు ,కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్, పార్టీ అబ్జర్వర్ శత్రురావు, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు అనురాధ, మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి, వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొంగరి గోవర్ధన్, వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.
ఫ టీపీసీసీ పరిశీలకుడు మురళీనాయక్