
ఆధారాలు పక్కాగా నమోదు చేయాలి
సూర్యాపేటటౌన్ : సూర్యాపేటటౌన్ : కేసుల దర్యాప్తులో సాక్షా ధారాలు పక్కాగా నమోదు చేయాలని జిల్లా ఎస్పీ కె.నరసింహ అధికారులకు సూచించారు. కేసుల్లో శిక్షల అమలు, పెండింగ్ కేసుల పరిష్కారానికి సంబంధించి కోర్టు, పోలీసు శాఖ సమన్వయంపై మంగళవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసు అధికారులు, కోర్టు డ్యూటీ సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసుల్లో నిందుతులను దోషులుగా నిరూపించి శిక్షలు పడేలా దర్యాప్తు పక్కాగానైపుణ్యంతో చేయాలని అధికారులకు సూచించారు. కోర్టు అధికారులతో సమన్వయంతో పని చేయాలని, సాక్షులను, నిందితులను, బాధితులను సమయానికి కోర్టులో హాజరు పర్చాలని పేర్కొన్నారు. నేరగాళ్లకు శిక్షలు పడేలా పని చేయడంలో దర్యాప్తు అధికారికి ఎంత బాధ్యత ఉంటుందో కోర్టు డ్యూటీ సిబ్బందికి కూడా అంతే బాధ్యత ఉంటుందన్నారు. కేసులు పెండింగ్ లేకుండా దర్యాప్తును సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, ఏఆర్ అదనపు ఎస్పీ జనార్దన్ రెడ్డి, డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, ఏఆర్ డీఎస్పీ నరసింహాచారి, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ నాగభూషణరావు తదితరులు పాల్గొన్నారు.
స్కానింగ్ సెంటర్ సీజ్
సూర్యాపేటటౌన్ : జిల్లా కేంద్రంలోని ఆపిల్ స్కానింగ్ సెంటర్‌ను జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ కోటాచలం మంగళవారం సీజ్ చేశారు. ఇటీవల తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు స్కానింగ్ సెంటర్‌ను తనిఖీ చేయగాస్కానింగ్ సెంటర్‌ను నకిలీ డాక్టర్ నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. నివేదికను కలెక్టర్, డీఎంహెచ్‌ఓకు సమర్పించారు. విచారణ చేపట్టిన జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి స్కానింగ్ సెంటర్‌ను సీజ్ చేశారు.
ప్రశాంతంగా పాలిసెట్
సూర్యాపేటటౌన్ : జిల్లా కేంద్రంలో పాలిసెట్ మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల ఏ, బీ సెంటర్ లు, ఎస్వీ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఆర్కేఎల్‌కే డిగ్రీ, పీజీ కళాశాల, శ్రీ మేధా జూనియర్ కళాశాల, శ్రీనిధి జూనియర్ కళాశాలలో పరీక్షలు నిర్వహించారు. 1436 మంది బాలురు, 1362 బాలికలు మొత్తం 2798 మంది దరఖాస్తు చేసుకున్నారు.1330 మంది బాలురు,1260 మంది బాలికలు మొత్తం 2,590 హాజరు కాగా, 106 మంది బాలురు, 102 బాలికలు మొత్తం 208మంది గైర్హాజరైనట్టు పాలిసెట్ జిల్లా కోఆర్డినేటర్ కె. సుజాత తెలిపారు.
హనుమంతుడికి ఆకుపూజ
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి క్షేత్రపాలకుడిగా ఉన్న శ్రీఆంజనేయస్వామికి అర్చకులు మంగళవారం ఆకుపూజను విశేషంగా నిర్వహించారు. ప్రధానాలయంతో పాటు విష్ణు పుష్కరిణి వద్ద, పాతగుట్ట ఆలయంలో ఆంజనేయస్వామిని సింధూరం, పాలతో అభిషేకించారు. అనంతరం తమలపాకులతో అర్చించారు. హనుమంతుడికి ఇష్టమైన నైవేద్యం సమర్పించి, భక్తులకు ప్రసాదంగా అందజేశారు. ఇక ప్రధానాలయంలో నిత్య పూజలు సంప్రదాయంగా కొనసాగాయి. శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, సాయంత్రం వెండి జోడు సేవ పూజలు నిర్వహించారు.

ఆధారాలు పక్కాగా నమోదు చేయాలి

ఆధారాలు పక్కాగా నమోదు చేయాలి