
ధాన్యం కొనుగోళ్లలో అలసత్వం వహించొద్దు
నాగారం: ధాన్యం కొనుగోళ్లలో ఐకేపీ నిర్వాహకులు అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ హెచ్చరించారు. మంగళవారం నాగారం మండల పరిధిలోని వర్థమానుకోట, నాగారంబంగ్లా గ్రామాల్లోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలను పరిశీలించి మాట్లాడారు. కేంద్రాలకు ధాన్యం తెచ్చిన వెంటనే నాణ్యతా ప్రమాణాలను పరిశీలించి కాంటాలు వేయాలని ఆదేశించారు. కాంటాలు అయిన ధాన్యాన్ని వెనువెంటనే మిల్లులకు తరలించాలని, లారీలు, హమాలీల కొరత తలెత్తకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మిల్లుల వద్ద మిల్లర్లు సకాలంలో ధాన్యం నిల్వలను దిగుమతి చేసుకునేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని అధికారులకు సూచించారు. మిల్లర్లు ధాన్యం దిగుమతుల్లో అలసత్వం వహించవద్దన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. అనంతరం రైతులను పలకరించి, కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ధాన్యం అమ్మకాల వివరాలతో కూడిన రసీదులు అందిస్తున్నారా అని ఆరా తీశారు. అలాగే ట్రక్‌షీట్లను, ట్యాబ్ ఎంట్రీ, రైతుల నుంచి ఇప్పటివరకు సేకరించిన ధాన్యం వివరాలను, మిల్లులకు తరలించిన ధాన్యం వివరాల రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బ్రహ్మయ్య, డీఎంసీఎస్ ప్రసాద్, ఏఓ కృష్ణకాంత్, ఆర్‌ఐ అల్లాఉద్దీన్, ఏపీఎం శోభారాణి తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్