
ఈఏపీ సెట్‌లో కలకోవ విద్యార్థికి 27వ ర్యాంకు
మునగాల: ఈఏపీ సెట్‌లో మునగాల మండలం కలకోవ గ్రామానికి చెందిన బుర్రి శ్రీనివాసరావు–విజయలక్ష్మి దంపతుల కుమారుడు రిషిక్‌కుమార్ రాష్ట్రస్థాయిలో 27వ ర్యాంకు సాఽధించాడు. రిషిక్‌కుమార్ ప్రాథమిక విద్య మునగాల, కోదాడలో, ఇంటర్ విద్య హైదరాబాద్‌లో కొనసాగింది. తమ కుమారుడు ఈఏపీ సెట్‌లో రాష్ట్రస్థాయిలో ఉత్తమ ర్యాంకు సాధించడం ఎంతో ఆనందంగా ఉందని తల్లిదండ్రులు తెలిపారు. ఈ సందర్భంగా రిషిక్‌కుమార్ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న మా నాన్న చిన్నతనం నుంచి నేర్పిన క్రమశిక్షణతోపాటు అధ్యాపకులు ఇచ్చిన ప్రోత్సాహం వల్లే తాను ఇంత మంచి ర్యాంకు సాధించానన్నాడు. భవిష్యత్‌లో ఉన్నతస్థాయి ఉద్యోగం సాధించి ప్రజాసేవ సేవ చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తానన్నారు.
సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి
సూర్యాపేట అర్బన్ : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 20న దేశ వ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో కార్మికవర్గం అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లు నాగార్జునరెడ్డి కోరారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలో ఎంవీఎన్ భవన్‌లో ఏర్పాటు చేసిన ఆ సంఘం సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.రాములు, మట్టిపల్లి సైదులు, కార్యదర్శి కొలిశెట్టి యాదగిరిరావు, దండా వెంకటరెడ్డి, కోట గోపి, ఎం.రాంబాబు, చెరుకు ఏకలక్ష్మి పాల్గొన్నారు.
వయోవృద్ధుల హక్కుల సాధనకు కృషి
తాళ్లగడ్డ (సూర్యాపేట) : వయోవృద్ధుల హక్కుల సాధన కోసం తనవంతు కృషిచేస్తానని తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ (టీఏఎస్‌సీఏ) జిల్లా అధ్యక్షుడు ఆరె రామకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో వయోవృద్ధుల సంఘం సమావేశం అనంతరం సీనియర్ సిటిజన్స్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ వయోవృద్ధుల హక్కుల చట్టం 2007కు సంబంధించిన వాల్‌పోస్టర్ ను కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించామని తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల నోటీసు బోర్డుల్లో ఉంచామని, అలాగే సుమారు 60గ్రామాల్లో వృద్ధులకు కరపత్రాలు పంచి ఈ చట్టంపై అవగాహన కల్పించామన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుడుగుంట్ల విద్యాసాగర్, సభ్యులు గుంటకండ్ల ముకుందరెడ్డి, అన్నపూర్ణమ్మ, పిచ్చమ్మ, ముస్కుల గోవిందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈఏపీ సెట్‌లో కలకోవ విద్యార్థికి 27వ ర్యాంకు

ఈఏపీ సెట్‌లో కలకోవ విద్యార్థికి 27వ ర్యాంకు