
మట్టపల్లి ఆలయం ముస్తాబు
మఠంపల్లి: ఈనెల 7 నుంచి 10 వరకు జరిగే అధ్యయనోత్సవాలకు మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ముస్తాబైంది. ఈనెల 10 నుంచి 15వరకు తిరుకల్యాణోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు చైన్నె తదితర నగరాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు.
● 7నుంచి 10వరకు తొలక్కం, అధ్యయనోత్సవం, పరమపద ఉత్సవం, శాత్తుమరై పూర్తిచేసి అదేరోజు రాత్రి ఉత్సవాలను ప్రారంభిస్తారు.
● 11న విశ్వక్సేనారాధన, అఖండదీపారాధన, అంకురారోపణ, ధ్వజారోహణం, లక్షమల్లికా సహస్రనామార్చన, లక్షమల్లికా పుష్పపూజ, అర్థరాత్రి ఎదుర్కోళ్లు ఉత్సవంతో శ్రీస్వామి అమ్మవార్లను అశ్వ, గజ, సింహ, గరుడ తదితర వాహనాలపై మంగళవాయిద్యాలతో భక్తుల జయజయఽ ధ్వానా ల నడుమ కల్యాణ మండపానికి చేరుస్తారు.
● 12న తెల్లవారు జామువరకు శ్రీస్వామివారి కల్యాణం నిండుపున్నమి వెన్నెల రాత్రిలో శోభాయమానంగా నిర్వహిస్తారు. అనంతరం గరుడవాహనసేవ , శ్రీస్వామివారి రథోత్సవం, హరికథలు, బుర్రకథలు ఏర్పాటు చేశారు.
● 13న శ్రీసూక్త సహిత మహాలక్ష్మియాగం, సాయంత్రం శ్రీస్వామి వారు కృష్ణానదిలో హంసవాహనంపై నావావిహారం చేస్తారు.
● 14న చక్రతీర్థం, వసంతసేవ, దోపుఉత్సవం చేపడతారు.
● 15న శృంగార డోలోత్సవం, పవళింపు సేవతో తిరుకల్యానోత్సవాలు ముగుస్తాయి.
అన్నదాన ఏర్పాట్లు
ఉత్సవాలకు వచ్చేభక్తులకు సుమారు 22కులాల అన్నదాన సత్రాలతో పాటు దేవస్థానం వారుకూడా భక్తులకు అన్నదానం ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు సరిపడా లడ్డూ, పులిహోర ప్రసాదాలు సిద్ధం చేశారు. ఎండతీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు భక్తులకు చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు పాలకవర్గం తెలిపింది. కృష్ణానదిలో భక్తులకు పుణ్యస్నానాలు ఆచరించడానికి ఏర్పాట్లు పూర్తికావస్తున్నాయి. ఆర్టీసీ ఆంధ్రాప్రాంతంలోని దాచేపల్లినుంచి, తెలంగాణ ప్రాంతంలోని హుజూర్‌నగర్ నుంచి అదనపు బస్సులు నడుపనుంది.
11 నుంచి వాహనసేవలు
ఈనెల 11న రాత్రి కల్యాణమూర్తి అలంకారంలో గజ, సింహ, శేషవాహనములు, 12న ఉదయం గరుడవాహనంపై శ్రీమన్నారాయణమూర్తి అలంకారం, సాయంత్రం శ్రీరాజమన్నార్ అలంకారంలో రథోత్సవం, 13న సాయంత్రం హంసవాహనంపై శ్రీరంగసాయి అలంకారం, 14నఅశ్వవాహనంపై శ్రీజయమన్నార్ అలంకారం, 15న పవళింపుసేవ నిర్వహించనున్నారు.
నేటి నుంచి 10 వరకు అధ్యయనోత్సవాలు
11న అర్ధరాత్రి స్వామివారి తిరుకల్యాణం
భారీగా తరలిరానున్న భక్తులు
కల్యాణోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
మట్టపల్లి దేవాలయంలో జరగనున్న తిరుకల్యాణోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. వివిధ కులాల అన్నదాన సత్రాలు భక్తులకు భోజన వసతులు కల్పించనున్నాయి. లడ్డూ,పులిహోర ప్రసాదాలు సిద్ధం చేస్తున్నాం
– చెన్నూరు విజయ్‌కుమార్, అనువంశిక చైర్మన్,మట్టపల్లి దేవాలయం

మట్టపల్లి ఆలయం ముస్తాబు

మట్టపల్లి ఆలయం ముస్తాబు