
ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం
భానుపురి (సూర్యాపేట) : ఆరోగ్యం విషయంలో ఆడపిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సూచించారు. సూర్యాపేట డివిజన్‌లోని నాలుగు మండలాల్లో 306 మంది లబ్ధిదారులకు రూ.3.06 కోట్ల కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మంగళవారం కలెక్టరేట్‌లో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడపిల్లలు న్యూట్రిషన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఆహారంలో అన్ని పోషకాలు లేకపోవడం వల్ల వివిధ వ్యాధుల బారినపడుతున్నారన్నారు. తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ పేద కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనివ్వాలని ప్రభుత్వం లక్ష రూపాయలను కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కింద అందజేస్తుందన్నారు. త్వరలోనే అర్హులందరికీ రేషన్ కార్డులు అందజేయనున్నట్లు తెలిపారు. సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ పేద ఆడపిల్ల పెళ్లికి రూ.1,00,116 అందించడం ఏ రాష్ట్రంలో లేదన్నారు. ఒక్క తెలంగాణలోనే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా నిరుపేద కుటుంబాలకు సహాయం అందిస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ వేణుమాధవ్, తహసీల్దార్లు శ్యాంసుందర్ రెడ్డి, లాలు, హరికిశోర్‌శర్మ, కృష్ణయ్య పాల్గొన్నారు.
కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్