
రూ.10 కోట్ల విలువ చేసే గంజాయి దహనం
భువనగిరి: రైళ్లలో తరలిస్తుండగా పట్టుకున్న గంజాయిని సికింద్రాబాద్ రైల్వే డ్రగ్ డిస్పోజల్ కమిటి చైర్మన్ చందనాదీప్తి ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తుక్కాపురంలోని రోమా పరిశ్రమలో దహనం చేశారు. పరిశ్రమ వద్ద చందనాదీప్తి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. 2024 నుంచి 2025 మే 5 వరకు రైళ్లలో తనిఖీలు నిర్వహించి 2010 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మొత్తం 74 కేసులను నమోదు చేసి పట్టుకున్న గంజాయి విలువ రూ. 10,05,06,750 ఉందన్నారు. సికింద్రాబాద్ అర్బన్, రూరల్, కాజీపేట డివిజన్ పరిధిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని తుక్కాపురం గ్రామ పరిధిలోని రోమా కంపెనీలో కాల్చివేసినట్లు చెప్పారు. గంజాయి రవాణాను అడ్డుకునేందుకు రైల్వే స్టేషనన్లతో పాటు రైళ్లలో పటిష్ట నిఘా పెడుతున్నట్లు చందనాదీప్తి చెప్పారు. విలేకరుల సమావేశంలో నోడల్ అధికారి ఎన్.జావేద్, కాజీపేట రైల్వే డీఎస్పీ కృపాకర్, సికింద్రాబాద్ రూరల్ డీఎస్పీ శ్రీనివాస్ పాల్గొన్నారు.