మామిడి కోతలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

మామిడి కోతలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

May 6 2025 1:22 AM | Updated on May 6 2025 1:22 AM

మామిడ

మామిడి కోతలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

ఇథిలిన్‌తో మాగబెట్టాలి

మామిడి కాయలను వ్యాపారులు కార్బైడ్‌ అనే రసాయనాన్ని ఉపయోగించి కృత్రిమంగా మాగబెడతారు. దీని వలన కాయ మంచి రంగు వస్తుంది కాని రుచి ఉండదు. పైగా అనారోగ్యానికి కారణమవుతోంది. రైతులు, వ్యాపారులు కార్భైడ్‌తో మాగబెట్టడానికి స్వస్తి పలికి ఆరోగ్యవంతమైన పద్ధతుల ద్వారా మాగించాలి. అప్పడే రుచి, శుచి లభిస్తాయి. ఈ రెండు ఉంటే మంచి ధర లభిస్తుంది. ఇథిలిన్‌తో మామిడిని మాగించడం అన్ని విధాలా మంచిది. ఇథిలిన్‌ అనేది గ్రోత్‌ హార్మోనన్‌్‌.. ఇది అన్నిచోట్ల లభ్యమవుతుంది. 10 లీటర్ల నీటికి ఒక మిల్లీలీటర్‌ ఇథిలిన్‌ కలిపిన ద్రావణంలో మామిడి కాయలను ముంచి నీడలో ఆరబెట్టిన తర్వాత గదిలో మామిడిని పోసి వరిగడ్డి కప్పితే 14 గంటల్లోనే మంచి రంగు, సువాసన వస్తుంది. ఇలా మామిడిని మాగించడం అన్ని విధాలా ఆరోగ్యదాయకం.

పెద్దవూర: ఈ ఏడాది వాతావరణ మార్పులతో మామిడి దిగుబడి అంతంత మాత్రంగానే ఉంది. మామిడి కాయలు ఇప్పుడిప్పుడే పక్వానికి వస్తున్నాయి. కోతలు కూడా మొదలవుతున్నాయి. అయితే చేతికందిన కాయలు, పండ్లను సరైన పద్ధతుల్లో నిల్వ, రవాణా చేస్తేనే ఎంతో కొంత లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో మామిడి కోతతో పాటు నిల్వ, రవాణా చేసే సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మామిడి కాయలు కోసే సమయంలో చిన్నపాటి నిర్లక్ష్యం చేసినా అపార నష్టం వాటిల్లే అవకాశం ఉందని పెద్దవూర మండల ఉద్యానవన శాఖ అధికారి మురళి చెబుతున్నారు. కాయలను సరైన పద్ధతిలో కోయకపోవడం, ముదిరిన కాయలతో పాటుగా ముదరని కాయలను కోయడం, గ్రేడింగ్‌, ప్యాకింగ్‌లో సరైన ప్రమాణాలు పాటించకపోవడం, అపరిశుభ్రత, నిల్వ లోపాల వలన పండ్లు చెడిపోతాయి. సరైన యాజమాన్య పద్ధతులను అనుసరించటం వలన ఈ నష్టాలను తగ్గించుకోవచ్చని ఆయన సూచిస్తున్నారు.

ఉదయం పది గంటలోపే కోయాలి

మామిడి తోటల్లో కాయలను సరైన దశలోనే కోయాలి. కాయలకు భుజాలు ఏర్పడి, తొడిమ వద్ద గుంత ఉండాలి. శ్వేద గ్రంథులు కనిపిస్తుండాలి. కాయ ఆకుపచ్చ రంగు నుంచి బాగా ముదిరిన లేత ఆకుపచ్చ రంగు కలిగిన కాయలనే కోతకు ఎంపిక చేసుకోవాలి. వీటిలోనూ బ్రిక్స్‌(చక్కెర శాతం) ఉన్న కాయలనే కోయాలి. బ్రిక్స్‌ మీటర్‌ ద్వారా బ్రిక్స్‌ 10–13 ఉన్న కాయలను కోసుకోవాలి. రిఫ్రాక్టో మీటరును ఉపయోగించి కాయల పరిపక్వ దశను సులభంగా గుర్తించవచ్చు. ఇవి రవాణాకు అనుకూలంగా ఉంటాయి. లోపల కండ లేత పసుపు రంగులో ఉండాలి. కోత ఉదయం 10 గంటల లోపు లేదంటే సాయంత్రం వేళ ఉండాలి. పక్వానికి వచ్చిన కాయలను చిక్కాలను ఉపయోగించి నేలపై పడకుండా కోసుకోవాలి. కాయలకు గాయాలైతే మగ్గబెట్టిన సందర్భంలో శిలీంధ్రాలు ఆశించి కుళ్లిపోయే ప్రమాదం ఉంది. కాయలకు 6 నుంచి 7సెంటీమీటర్ల తొడిమ ఉండేటట్లు చూసుకోవాలి. కాయల మీద ఉండే చర్మానికి సొన(జిగురు) అంటకుండా జాగ్రత్త తీసుకోవాలి. కాయ కోసిన తర్వాత తప్పనిసరిగా సొన(జిగురు) పూర్తిగా కారేలా చూడాలి. తర్వాత తొడిమలను 0.5 నుంచి 1 సెంటీమీటర్‌ వరకు ఉండేలా పదునైన కత్తితో కత్తిరించాలి. వాటిని తలకిందులుగా పెట్టి రెండుమూడు గంటలపాటు కదిలించకుండా ఉంచాలి. అప్పుడే కాయల నుంచి సొన సజావుగా నేల మీదికి కారుతుంది. కోతల సమయంలో కాయలపై చిన్న మచ్చ గాని, దెబ్బ గాని తగలకుండా జాగ్రత్త పడాలి. కోసిన కాయలను మట్టి నేలపై ఉంచకూడదు.

శుభ్రపర్చడం చాలా అవసరం

మామిడి కాయలను శుభ్రపరచడం చాలా అవసరం. 10 గ్రాముల డిటర్జంట్‌ను 10 లీటర్ల నీటికి కలిపిన ద్రావణంలో కాయలను కడగాలి. తర్వాత 52 సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రత గల వేడి నీటిలో 200 పీపీఎం సోడియం హైపోక్లోరైడ్‌ కలిపి 2 నుంచి 3 నిమిషాల పాటు ఉంచాలి. రవాణా సమయంలో ఆంత్రాక్నోస్‌, పండు ఈగల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. వీటి నివారణకు కాయలను 48+0.3 సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రత కలిగిన నీటిలో గంట సేపు శుద్ధి చేయాలి. కాయలపై ఉన్న తేమ ఆరే వరకు నీడలో ఆరబెట్టాలి. 300–350 గ్రాముల బరువు ఉండేటట్లు గ్రేడింగ్‌ చేసుకుని, అట్టపెట్టెలలో 10 నుంచి 13 కాయలు అమర్చి ప్యాకింగ్‌ చేసుకోవాలి. ప్యాంకిగ్‌ కోసం టెలిస్కోపిక్‌ కార్గేటెడ్‌ ఫైబర్‌ బోర్డు బాక్సులను వాడాలి. వీటిని ఆరుగంటల లోపే ప్యాక్‌హౌజ్‌కు తరలించాలి. విదేశాలకు ఎగుమతి చేయాల్సిన పండ్లకు తప్పనిసరిగా ఇర్రాడియేషన్‌ చేయించాలి. ఒకసారి కోతకు ఉపయోగించిన పనిముట్లను తిరిగి మళ్లీ వాడాల్సి వస్తే వాటిని తప్పనిసరిగా శుభ్రం చేయాలి.

పురుగు మందులను పిచికారీ చేయరాదు

నిషేధించిన పురుగు మందులను కాయలపై పిచికారీ చేయకూడదు. వీలైనంత వరకు సేంద్రీయ పురుగు మందులను మాత్రమే వాడాలి. కోత తర్వాత వచ్చే తెగుళ్ల నివారణకు తోటలో ముందు నుంచే మంచి జాగ్రత్తలు తీసుకోవాలి. తోటలో కలుపు లేకుండా శుభ్రం చేసుకోవాలి. కాయలు చిన్నసైజులో ఉన్నప్పుడు, తిరిగి కాయ కోతకు ముందు లీటరు నీటికి ఒక గ్రాము కార్భండిజమ్‌ లేదా థయోఫానేట్‌ మిథైల్‌ కలిపి చెట్లపై పిచికారీ చేయాలి. కాత దశలో మూడుసార్లు ఇలా పిచికారీ చేస్తే కాయలపై చీడల బెడద తగ్గుతుంది. కాయలు కుళ్లిపోకుండా ఉంటాయి.

పెద్దవూర మండల ఉద్యానవన శాఖ అధికారి మురళి సూచనలు

మామిడి కోతలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి1
1/1

మామిడి కోతలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement