
స్వర్ణగిరి క్షేత్రంలో తిరువీధి ఉత్సవ సేవ
భువనగిరి: భువనగిరి పట్టణంలోని స్వర్ణగిరి క్షేత్రంలో శ్రీవేంకటేశ్వర స్వామికి సోమవారం తిరువీధి ఉత్సవ సేవ నిర్వహించారు. అంతకుముందు ఆలయంలో సుభ్రబాత సేవ, తోమాల సేవ, సహాస్రనామార్చన నిర్వహించారు. అనంతరం పద్మావతి, గోదాదేవి సమేత వేంకటేశ్వర స్వామికి నిత్య కల్యాణం, మధ్యాహ్నం సుమారు 3వేల మందికి అన్నదానం, సాయంత్రం సహస్ర దీపాలంకరణ కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
అదుపుతప్పి ఆటో బోల్తా..
ఏడుగురికి గాయాలు
రామన్నపేట: అదుపుతప్పి ఆటో బోల్తా పడడంతో ఏడుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం రామన్నపేట మండలం దుబ్బాక గ్రామ శివారులో జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని రామాంతాపూర్‌కు చెందిన రెండు కుటుంబాల వారు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం కొండగడపలో బొడ్రాయి పండుగకు వెళ్లారు. సోమవారం ఆటోలో రామాంతాపూర్‌కు తిరుగు పయనమయ్యారు. ఆటో రామన్నపేట మండలం దుబ్బాక గ్రామ శివారులోని కోళ్లఫాంల వద్దకు రాగానే అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న బి. జ్యోతి, వైష్ణవి, కె. గంగమ్మ, వెంకటేష్, కొండయ్యతో పాటు మరో ఇద్దరు చిన్నారులకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారికి ప్రథమ చికిత్స చేసి ఆస్పత్రికి తరలించారు.
మృతుడి వివరాలు లభ్యం
కొండమల్లేపల్లి : కొండమల్లేపల్లి మండలం చింతకుంట్ల గ్రామంలో ఆదివారం వ్యవసాయ బావిలో పడి మృతి చెందిన వ్యక్తి వివరాలు లభ్యమైనట్లు ఎస్‌ఐ రామ్మూర్తి సోమవారం తెలిపారు. మృతుడు హైదరాబాద్‌కు చెందిన ముడుసు కార్తీక్(28)గా గుర్తించామన్నారు. అతడు కారు డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. ఆదివారం తన స్నేహితులతో కలిసి కొండమల్లేపల్లి మండలం గుమ్మడవెల్లి గ్రామ పంచాయతీ సమీపంలోని రైస్ మిల్లుల వద్ద బంధువుల పెళ్లికి వచ్చి మధ్యాహ్న సమయంలో ఈత కొట్టడానికి చింతకుంట్ల గ్రామంలోని ఓ వ్యవసాయ బావిలో దిగగా.. ప్రమాదవశాత్తు బావిలో మునిగి మృతిచెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి తల్లి, తమ్ముడు ఉన్నట్లు సమాచారం.
వడదెబ్బతో వృద్ధుడు మృతి
చండూరు: ఎండల తీవ్రతకు చండూరు మున్సిపాలిటీకి చెందిన దోటి నరసింహ(80) వడదెబ్బకు గురై సోమవారం సాయంత్రం మృతిచెందాడు. సీపీఐ నాయకులు నరసింహ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.