
ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్ ఎదుట కార్మికుల ధర్నా
మోటకొండూర్: తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని మోటకొండూర్ మండలం కాటేపల్లి గ్రామంలోని ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీ గేటు ఎదుట సోమవారం ఉదయం అందులో పనిచేసే కార్మికులు ధర్నా చేపట్టారు. ఇటీవల కంపెనీలో రియాక్టర్ పేలి ముగ్గురు దుర్మరణం చెందగా.. తమ ప్రాణాలకు భరోసా కల్పించాలని, కనీస వేతనం రూ.30వేలు ఇవ్వాలని, రోజుకు 8 గంటలే పని ఉండేలా చూడాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. డ్యూటీలో ఇద్దరు కార్మికులను, ఒక డాక్టర్ ఎల్లప్పుడూ కంపెనీలో అందుబాటులో ఉంచాలన్నారు. కాంట్రాక్ట్ వ్యవస్థను తొలగించి కంపెనీ నుంచే ప్రతి ఒక్కరిని రిక్రూట్ చేసుకోవాలన్నారు. మెరుగైన ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడంతో పాటు పనిలో చేరి వెంటనే ఈఎస్‌ఐ, పీఎఫ్ వర్తింపజేయాలన్నారు. సకాలంలో జీతాలు ఇవ్వాలని, కార్మికుల కోసం భోజనం హాల్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో కంపెనీ డైరెక్టర్ దుర్గాప్రసాద్ వచ్చి వీలైనంత త్వరగా కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయితే తమ న్యాయమైన డిమాండ్లను నెరవేరిస్తేనే విధులకు హాజరవుతామని, అప్పటి వరకు కంపెనీకి రాలేమని కార్మికులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ధర్నాలో కార్మికులు జి. నాగిరెడ్డి, వాకిటి నవీన్‌రెడ్డి, కాదూరి ఎలేందర్, బాల్ద సిద్దులు, నాగార్జున, ప్రవీణ్, చందు, నాగరాజు తదితరులు ఉన్నారు.
తమ సమస్యలను పరిష్కరిస్తేనే విధులకు హాజరవుతామని తెలిపిన కార్మికులు