అజాగ్రత్త వల్లే రోడ్డు ప్రమాదాలు
ఫ ఎస్పీ నరసింహ
సూర్యాపేటటౌన్ : మానవతప్పిదాలు, నిర్లక్ష్యం, అజాగ్రత్త వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఎస్పీ నరసింహ అన్నారు. సూర్యాపేట రూరల్ పరిధిలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల బ్లాక్ స్పాట్లను మంగళవారం రాత్రి ఆయన పరిశీలించి మాట్లాడారు. ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని, నిత్యం ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో లోపాలను గుర్తించి సవరించాలని అధికారులను ఆదేశించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ నిర్వహిస్తూ నిబంధనలను అతిక్రమించే వాహనదారులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. చాలామంది రోడ్డు ప్రమాదాల బారిన పడి అర్ధంతరంగా చనిపోతున్నారన్నారు. జాతీయ రహదారి వెంట ఉండే గ్రామాల ప్రజలు, వ్యవసాయ పనులకు వెళ్లే వారు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మద్యం మత్తులో వాహనాలు నడపవద్దని, బైక్ నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, సీటు బెల్ట్ విధిగా పెట్టుకోవాలన్నారు. ఆయన వెంట సీఐ రాజశేఖర్, ఎస్‌ఐ బాలు నాయక్, సిబ్బంది ఉన్నారు.


