
ఆలయంలో నిత్య కల్యాణం నిర్వహిస్తున్న ఆచార్యులు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయంలో మంగళవారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. క్షేత్రపాలకుడిగా కొనసాగుతున్న ఆంజనేయస్వామికి ఇష్టమైన రోజు కావడంతో ఆచార్యులు అకుపూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆంజనేయస్వామిని సింధూరంతో అభిషేకించి, తమలపాకులతో అర్చించారు. అనంతరం అంజనీపుత్రుడికి ఇష్టమైన నైవేద్యాన్ని ఆరగింపు పెట్టారు. ప్రధానాలయంలో, విష్ణు పుష్కరిణి, అనుబంధ ఆలయాలైన శివాలయం, పూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయాల వద్ద ఉన్న ఆంజనేయస్వామిని భక్తులు మొక్కుకొని, పూజలు చేశారు. ఇక ప్రధానాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు సంప్రదాయ పూజలు కొనసాగాయి. సుప్రభాతం, అభిషేకం, అర్చన, శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, జోడు సేవలను విశేషంగా నిర్వహించారు.
నిధుల దుర్వినియోగంపై డీఎల్‌పీఓ విచారణ
మాడుగులపల్లి : మండలంలోని భీమనపల్లి, సీత్యాతండా, గండ్రవానిగూడెం గ్రామ పంచాయతీల్లో నిధుల దుర్వినియోగం జరిగిందన్న అభియోగాలపై మంగళవారం డీఎల్‌పీఓ ప్రతాప్‌నాయక్ విచారణ చేపట్టారు. పంచాయతీల్లో నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపిస్తూ వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామానికి చెందిన సమాచార హక్కు సంరక్షణ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు అనంతాచారి ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఫిర్యాదుదారుడి సమక్షంలో ఆయా పంచాయతీల సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శుల వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఆయా పంచాయతీల్లో ఎంబీ రికార్డులు, క్యాష్ బుక్స్, ఇతర రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. రికార్డులను పరిశీలించి నెలరోజుల్లో జిల్లా పంచాయతీ అధికారికి నివేదిక డీఎల్‌పీఓ అందజేస్తామన్నారు.

భీమనపల్లి పంచాయతీ కార్యాలయంలో విచారణ చేస్తున్న డీఎల్‌పీఓ ప్రతాప్‌నాయక్