భూదాన్‌పోచంపల్లి: మండలంలోని జలాల్‌పురంలో గల స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థలో మేథా చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో 6నెలల కాలపరిమితి గల కంప్యూటర్ హార్డ్‌వేర్, సెల్‌ఫోన్ అండ్ ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్, సీసీ టీవీ టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్ (డొమెస్టిక్), సోలార్ సిస్టమ్ ఇన్‌స్టాలేషన్ అండ్ సర్వీస్, టైలరింగ్ ఎంబ్రాయిడరీ జర్దోజి, క్విల్ట్ బ్యాగుల తయారీ కోర్సులలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ పీఎస్‌ఎస్‌ఆర్ లక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కంప్యూటర్ హార్డ్‌వేర్, సెల్‌ఫోన్ అండ్ ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్, సీసీ టీవీ టెక్నీషియన్ కోర్సుకు ఇంటర్మీడియట్ పాస్ లేదా ఫెయిల్, ఎలక్ట్రీషియన్ (డొమెస్టిక్), సోలార్ సిస్టమ్ ఇన్‌స్టాలేషన్ అండ్ సర్వీస్ కోర్సుకు ఐటీఐ లేదా డిప్లొమా పాస్, టైలరింగ్ ఎంబ్రాయిడరీ జర్దోజి, క్విల్ట్ బ్యాగుల తయారీ కోర్సుకు 8వ తరగతి విద్యార్హత కల్గి ఉండాలన్నారు. 18 నుంచి 25 సంవత్సరాల లోపు వయస్సు కల్గినవారు అర్హులని తెలిపారు. ఆసక్తి, అర్హత కల్గిన అభ్యర్థులు తమ విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్‌కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలతో ఏప్రిల్ 10న సంస్థలో నిర్వహించే కౌన్సిలింగ్‌కు హాజరుకావాలని సూచించారు. ఎంపికై న అభ్యర్థులకు శిక్షణ కాలంలో ఉచిత భోజనంతో కూడిన హాస్టల్ వసతి కల్పిస్తామన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత ఉద్యోగం కల్పించబడుతుందని చెప్పారు. వివరాలకు 9133908000, 9133908111, 9133908222 నెంబర్లను సంప్రందించాలని సూచించారు.