టెక్కలి: జిల్లాలో పోర్టు నిర్మాణం పేరుతో ప్రజల్ని ఊరిస్తూ టీడీపీ నాయకులు దశాబ్దాల కాలంగా పబ్బం గడుపుకుని అధికారం వెలగబెట్టుకున్నారని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. మూలపేట పోర్టుకు పోదాం పదండి కార్యక్రమంపై ఆయన మాట్లాడారు. దివంగత ఎర్రంన్నాయుడు నుంచి ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా ఉన్న రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడు సైతం భావనపాడులో పోర్టు కడతామంటూ ఏళ్ల తరబడి ఓటు రాజకీయాలు చేశారని దుయ్యబట్టారు. పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం.. వైఎస్సార్‌సీపీ హయాంలో గత సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేకంగా సంకల్పించి మూలపేటలో పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారని అప్పలరాజు గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూలపేట పోర్టు క్రెడిట్‌ను దోచుకునే విధంగా టీడీపీ నాయకులు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని, వీటిని తిప్పికొట్టడానికి మూలపేట పోర్టుకు పోదాం పదండి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక
శ్రీకాకుళం పాతబస్టాండ్: నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్), రెవెన్యూ క్లినిక్ (భూ సమస్యలపై) సోమవారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అర్జీదారులు నేరుగా లేదా ఆన్‌లైన్‌లో అర్జీలు నమోదు చేసుకోవచ్చునని పేర్కొన్నారు. భూ సమస్యలపై రెవెన్యూ క్లినిక్ ఏర్పాటు చేయడమైనదని, ఈ అవకాశాన్ని అర్జీదారులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
శ్రీకాకుళం: జిల్లా కేంద్రంలోని డీసీసీబీ కాలనీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. భవన నిర్మాణ పనుల్లో భాగంగా తాపీపని చేస్తున్న బార రామారావు (45) విద్యుత్ ఘాతానికి గురై ఆదివారం మృతి చెందాడు. పని చేస్తున్న సమయంలో పైన ఉన్న విద్యుత్ వైర్లు తగలడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు వెంటనే స్పందించి బాధితుడిని శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించగా, వైద్యులు ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి భార్య బార్ అప్పన్నమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
గార: మండలంలోని వత్సవలస రాజమ్మ తల్లి జాతరకు వెళ్తూ ఆర్టీసీ బస్సు చక్రాలు కిందపడి మహిళ మృతి చెందింది. జి.సిగ డాం మండలం ఎస్‌పీ రామచంద్రాపురాని (అగ్రహారం)కి చెందిన ముగుడ కనక (50) కుమారుడు కవిలేశు స్కూటీపై ఆదివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో శ్రీకూ ర్మం మీదుగా వత్సవలస వెళ్తున్నారు. తండ్యాలపేట గ్రామ సమీపంలోకి వచ్చేసరికి ఎదురు గా వస్తున్న ఆర్టీసీ బస్సు స్కూటీకి తగిలింది. దీంతో డ్రైవింగ్ చేస్తున్న కవిలేశు పక్కకు పడిపోగా, తల్లి కనక రోడ్డుపై పడిపోవడంతో తలపై నుంచి ఆర్టీసీ బస్సు వెనుక చక్రం వెళ్లిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు కనక భర్త గుజరాత్ రాష్ట్రంలోని ఒక ప్రైవేటు పరిశ్రమలో పనిచేస్తున్నాడు. కవిలేశు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్‌ఐ తెలుగు చంద్రమోహన్ తెలిపారు.
స్కూటీ అదుపుతప్పి మహిళ మృతి
పోలాకి: మండలంలోని సుసరాం ర్యాంపుల వద్ద స్కూటీ అదుపుతప్పి జరిగిన ప్రమాదంలో ఉర్జాం గ్రామానికి చెందిన సంపతిరావు తేజ అనే మహిళ మృతి చెందినట్లు ఎస్‌ఐ రంజిత్ తెలిపారు. మరో మహిళతో కలిసి ఒక ఫంక్షన్‌లో మెహందీ పెట్టేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద స్థలం వద్ద నుంచి పోలీసుల సహకారంతో నరసన్నపేట ఆస్పత్రికి తరలించగా, అప్పటికే తేజ మృతి చెందింది. మృతురాలి భర్త ప్రకాశ్ కూరగాయల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా, అతనికి ఆర్థికంగా అండగా నిలవాలనే ఉద్దేశంతో మెహందీ పెట్టేందుకు తేజ వెళ్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.


