 
															అంగన్‌వాడీ... సమస్యల ఒడి..!
ఇబ్బందులివీ..
● కేంద్రాల్లో సిబ్బంది కొరత
● సక్రమంగా అందని పౌష్టికాహారం
● పనిభారంతో సిబ్బంది అవస్థలు
● పట్టించుకోని అధికారులు
శ్రీకాకుళం అర్బన్:
జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం అర్బన్ ప్రాజెక్టు పరిధిలో దమ్మలవీధి–2 అంగన్‌వాడీ కేంద్రంలో పనిచేస్తున్న టీచర్ తన జాబ్‌కు రాజీనామా చేసింది. జబ్బావీధి–1 అంగన్‌వాడీ కేంద్రం, అలాగే కత్తెరవీధి–1 అంగన్‌వాడీ కేంద్రంలో పనిచేస్తున్న టీచర్లు కూడా రిజైన్ చేశారు. దీంతో ఈ కేంద్రాల్లో ఆయాలే ఉండడంతో.. పక్కనున్న సెంటర్ల టీచర్లు ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తూ నెట్టుకొస్తున్నారు. అయితే ఆయా టీచర్లు రెండేసి కేంద్రాలను ఎలా సమర్ధవంతంగా నిర్వహించగలరన్నది ప్రశ్నార్థకం. జిల్లాలో మరిన్ని కేంద్రాల్లో దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొంది.
అదనపు భారం
వాస్తవానికి ప్రతీ అంగన్‌వాడీ కేంద్రానికి ఒక టీచర్, ఒక ఆయా ఉండాలి. టీచర్ ప్రతిరోజూ చిన్నారులకు ఆటపాటలతో కూడిన విద్యనందించాలి. అలాగే ఆయా అంగన్‌వాడీ కేంద్రం పరిధిలోని గర్భిణులు, బాలింతలకు టేక్ హోం రేషన్(టీహెచ్‌ఆర్) రెండు విడతల్లో అందజేస్తారు. అయితే కొన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో అవసరమైన సిబ్బంది లేకపోవడంతో ఈ కార్యక్రమాలేవీ సక్రమంగా జరగడం లేదు. జిల్లాలో 16 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో 28 టీచర్ పోస్టులు, 62 ఆయా పోస్టులు ఖాళీలు ఉన్నాయి. వీటిలో 14 అంగన్‌వాడీ కార్యకర్త పోస్టులు క్లియర్ వేకెన్సీ ఉండగా.. ఆయా పోస్టులు 38 క్లియర్ వేకెన్సీ ఉన్నాయి. అయినా టీచర్, ఆయా పోస్టులను భర్తీ చేయకపోవడంతో ఆయా కేంద్రాల పరిధిలోని బాలింతలు, గర్భిణులు, చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు. టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్న కేంద్రాల నిర్వహణ బాధ్యతలను పక్క కేంద్రాల వారికి అప్పగించంతో వారిపై అదనపు భారం పడుతోంది. దీంతో కేంద్రాలు సమస్యలకు నిలయంగా మారుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
జిల్లాలో పరిస్థితి...
జిల్లాలో 16 ప్రాజెక్టులు ఉండగా.. వాటి పరిధిలో 130 సెక్టారులు ఉన్నాయి. వీటి పరిధిలో 3,385 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల పరిధిలో 9,270 మంది గర్భిణులు, 8,935 మంది బాలింతలు, ఆరు నెలల లోపు చిన్నారులు 7,252 మంది, 6 నెలల నుంచి 3 ఏళ్లలోపు చిన్నారులు 49,589 మంది, 3 ఏళ్ల నుంచి 6 ఏళ్లలోపు చిన్నారులు 45,265 మంది ఉన్నారు.
అంగన్‌వాడీ కేంద్రాల్లో పూర్తిస్థాయిలో సిబ్బంది లేకపోవడం వలన సమర్ధవంతంగా చిన్నారులకు విద్యను అందించలేకపోతున్నారు.
పౌష్టికాహారం సకాలంలో అందించడం కష్టసాధ్యంగా మారుతోంది.
ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ఆటంకంగా మారుతోంది.
కార్యకర్తలపై పనిభారం పెరుగుతోంది.
ప్రీ స్కూల్ కార్యక్రమాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారు.
సెలవులు పెట్టుకునే అవకాశం ఉన్నా ఆ హక్కును సిబ్బంది కోల్పోతున్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
